YCP Sharmila: జగన్ బలప్రదర్శనలపై నిషేధం విధించాలి
ABN , Publish Date - Jun 27 , 2025 | 02:48 AM
పర్యటనల పేరుతో జగన్ చేస్తున్న బలప్రదర్శనలపై నిషేధం విధించాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ బలోపేతం రాజకీయ అవసరం: షర్మిల
విజయవాడ, నరసరావుపేట టౌన్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): పర్యటనల పేరుతో జగన్ చేస్తున్న బలప్రదర్శనలపై నిషేధం విధించాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్ చేసిన బలప్రదర్శనలకు ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మరో దుర్ఘటన జరగకుండా జగన్ బల ప్రదర్శనలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కమిటీ సమావేశం విజయవాడలో, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో విస్తృత స్థాయి సమావేశం గురువారం జరిగాయి.
ఆయా సందర్భాల్లో ఆమె మాట్లాడారు. ‘జగన్‌కు ప్రజాసమస్యలపై దృష్టి లేదు. ఆయనకు కావాల్సినవి బలప్రదర్శనలు మాత్రమే. చంపినోళ్లు, చంపించినోళ్లు నేరం ఒప్పుకుంటారా? సొంత బాబాయిని చంపించి ఆ నేరాన్ని ఆయన కుమార్తె మీదకు తోశారు. అటువంటి వ్యక్తికి సింగయ్య మృతిపై ఏఐ వీడియో అంటూ అబద్ధాలు చెప్పడం ఒక లెక్కా..! బీజేపీ మోసాలపై చంద్రబాబు, పవన్ స్పందించడం లేదు. వాళ్లంతా బీజేపీకి ఊడిగం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడటం రాజకీయంగా చాలా అవసరం. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాం’ అని పేర్కొన్నారు.