Server issues: సర్వర్ కష్టాలు
ABN , Publish Date - May 17 , 2025 | 04:14 AM
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు భారీగా రావడంతో సర్వర్ పై ఒత్తిడి పెరిగి ఆన్‌లైన్ దరఖాస్తులు నిలిచిపోతున్నాయి. ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. 10 రోజుల్లోనే 2,44,889 దరఖాస్తులు అందాయి.
కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుదారులకు అవస్థలు
భారీగా దరఖాస్తులతో సర్వర్లపై ఒత్తిడి.. ఆన్‌లైన్ కాని వైనం
అందుబాటులోకి రాని ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలు
గ్రామ, వార్డు సచివాలయాలకు పోటెత్తుతున్న జనం
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తున్న అర్జీదారులను సర్వర్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకేసారి భారీస్థాయిలో దరఖాస్తులు వస్తుండటంతో సర్వర్లపై ఒత్తిడి పెరిగి, దరఖాస్తులు ఆన్‌లైన్ కావడం లేదని చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే కాకుండా ఈనెల 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర) ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఆ సేవలు ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలకు దరఖాస్తుదారుల తాకిడి విపరీతంగా పెరిగింది. సర్వర్లు పనిచేయకపోవడంతో దరఖాస్తులు ఆన్‌లైన్ కావడం లేదంటూ అక్కడి ఉద్యోగులు వెనక్కి పంపిస్తున్నారని దరఖాస్తుదారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మండుటెండలో పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలోని అర్హులందరికీ కొత్త రేషన్ కార్డుల జారీతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల విభజన, సభ్యుల చేర్పులు, తొలగింపులు, చిరునామాల మార్పు, అనర్హుల కార్డుల సరెండర్, ఆధార్ సీడింగ్‌ను సరిచేసుకోవడం తదితర 10 రకాల సేవల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఈనెల 7 నుంచి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. పైగా జూన్‌లోనే కొత్త రేషన్‌కార్డులు అందజేస్తామని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడంతో ఏళ్ల తరబడి రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారంతా దరఖాస్తు ఫారాలు పట్టుకుని సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకొని, వేరు కాపురాలు పెట్టుకున్న జంటలతోపాటు అర్హతలు ఉన్న పేద కుటుంబాల వారు పోటెత్తుతున్నారు. దీంతో అర్జీదారుల హడావుడితో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు అవకాశం కల్పిస్తే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.
10 రోజుల్లోనే 2,44,889దరఖాస్తులు
కొత్త రైస్ కార్డులు, ఇతర సేవల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఈనెల 7 నుంచి 16వ తేదీ వరకు 10 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 2,44,889 దరఖాస్తులు అందాయి. వీటిలో కొత్త కార్డుల కోసం 30,614, ఉన్న కార్డుల విభజన కోసం 20,392, కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం 1,79,523, సభ్యుల తొలగింపు కోసం 6,397, తప్పు ఆధార్ సీడింగ్‌ను సరిచేయడానికి 3,743, కార్డుల సరెండర్ కోసం 260, చిరునామా మార్పు కోసం 3,799 మంది దరఖాస్తులు చేసుకోగా.. రేషన్ షాపుల రెన్యువల్స్ కోసం 161 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని సివిల్ సప్లయిస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News