Liquor Scam Case: ముగిసిన సజ్జల కస్టడీ
ABN , Publish Date - May 18 , 2025 | 04:28 AM
మద్యం స్కామ్ కేసులో కస్టడీలో ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని విచారణ అనంతరం జైలుకు తరలించారు. తనపై ఆరోపణలకు సంబంధించి రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని న్యాయాధికారి ఆదేశించారు.
విజయవాడ, మే 17(ఆంధ్రజ్యోతి): మద్యం స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి కస్టడీ శనివారంతో ముగిసింది. విచారణ ముగిసిన అనంతరం ఆయన్ను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. విచారణలో పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని న్యాయాధికారి ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని ఆయన సమాధానం ఇచ్చారు. మద్యం కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని శ్రీధర్‌రెడ్డి న్యాయాధికారి భాస్కరరావుకు వివరించారు. 20వ తేదీన తనకు రిమాండ్ పొడిగింపు ఉందని, అప్పుడు ఐదు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరారు. తాను చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయని, అందుకోసమే ఈ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. చెప్పాలనుకున్న విషయాలను రాతపూర్వకంగా అందజేయాలని న్యాయాధికారి ఆదేశించారు. అనంతరం శ్రీధర్‌రెడ్డిని జిల్లా జైలుకు తరలించారు.