Share News

RTI Chief Commissioner: ఆర్‌టీఐలో నేనే సర్కార్‌

ABN , Publish Date - May 06 , 2025 | 04:33 AM

ఆర్‌.ఎం.బాషా, ఆర్‌టీఐ చీఫ్‌ కమిషనర్‌గా తన పదవిలో ఉన్నప్పుడు కొత్త సెక్రటరీ వీ. అంజనేయులును అధికారికంగా కలుసుకోవాలని వచ్చినప్పుడు గదికి తాళం వేయించిన ఘటనే సంచలనం సృష్టించింది. ఆయనను ఎదుర్కొన్న అవమానంతో ఆంజనేయులు వెనుదిరిగారు, ఈ ఘటన ప్రభుత్వానికి సమస్యగా మారింది.

RTI Chief Commissioner: ఆర్‌టీఐలో నేనే సర్కార్‌

  • ప్రభుత్వమైనా నన్ను అడిగే చేయాలి

  • నా సమ్మతితోనే నియామకాలు జరగాలి

  • అడక్కుండా నియమించడానికి సీఎస్‌ ఎవరు?

  • చీఫ్‌ కమిషనర్‌ బాషా హుంకరింపు!

  • కొత్త సెక్రటరీ గదికి తాళం వేయించిన వైనం

  • మర్యాదపూర్వకంగా కలుస్తానన్నా నిరాకరణ

  • అవమానభారంతో వెనుదిరిగిన సెక్రటరీ

  • రెండేళ్ల క్రితం ఆర్‌టీఐలోకి వచ్చిన మాజీ జర్నలిస్టు

  • ఒక అఖిల భారత సర్వీసు అధికారిపైనే జులుం

  • నేడు సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లే యోచనలో అధికారి

అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): ‘‘సెక్రటరీని నియమించడానికి ప్రభుత్వం ఎవరు? సీఎస్‌ ఎవరు? సమాచార కమిషన్‌లో ప్రభుత్వమైనా నన్ను అడిగే ఏదైనా చేయాలి’’... వైసీపీ హయాంలో చీఫ్‌ సమాచార కమిషనర్‌గా నియమితులైన ఆర్‌.ఎం.బాషా హుంకరింపు ఇది. రెండేళ్ల క్రితం ఈ పోస్టులోకి వచ్చిన మాజీ జర్నలిస్టు అయిన బాషా...ఒక అఖిలభారత సర్వీసు అధికారినే అడ్డుకుని ఆయన గదికి తాళం వేయించారు. ఆయనను చాలాసేపు పడిగాపులు పడేలా చేశారు. ఆర్‌టీఐ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే...సమాచార కమిషన్‌ సెక్రటరీగా వీ అంజనేయులును ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీన నియమించింది. ఆర్‌టీఐ వ్యవహారాలపై సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్‌టీఐకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. కేసుల విచారణకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ స్డూడియో సిద్ధం చేయాల్సి ఉంది. వీటితోపాటు ఆర్‌టీఐ కమిషనర్ల నియామకంలో నిబంధనలు పాటించలేదన్నదానిపై ఆరువారాల్లో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలి. ఇందులో ఇప్పటికే రెండువారాలు గడిచిపోయాయి. మరో నాలుగు వారాల్లో దీనిపై సుప్రీం కోర్టుకు నివేదిక ఇవ్వాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై కొత్త సెక్రటరీగా ఆంజనేయులును నియమించింది. ఆంజనేయులు బాధ్యతలు తీసుకోవడానికి సోమవారం కార్యాలయానికి చేరుకున్నారు.


గది ముందు పడిగాపులు..

ఆంజనేయులు సమాచార కమిషన్‌ కార్యాలయానికి వెళ్లే ముందే కింది అధికారికి కొన్ని పనులు పురమాయించారు. ప్రభుత్వం అడిగిన కొన్ని ఫైళ్లను సిద్ధం చేయాల్సింగా ఆదేశించారు. చీఫ్‌ కమిషనర్‌ను తాను కార్యాలయంలో కలుస్తానని కూడా సమాచారం పంపించారు. తొలిరోజు చేయాల్సిన పనులకోసం హడావుడిగా కార్యాలయానికి చేరుకున్న ఆయనను తన గదికి వేసిన తాళంకప్ప వెక్కిరించింది. రూమ్‌ తాళం తెరవాలని కార్యాలయం సిబ్బందిని ఆయన ఆదేశించారు. తాళం చీఫ్‌ కమిషనర్‌ బాషా వద్ద ఉందని ఆయనకు వారు తెలిపారు. దీంతో ఆయన గది బయటే నిలబడిపోయారు. చీఫ్‌ కమిషనర్‌ను కలవాలనుకుంటున్నట్టు వ్యక్తిగత సిబ్బందితో ఆర్‌.ఎం.బాషాకు సమాచారం అందించారు. అయితే, తాను పనిలో ఉన్నారని...వేచి ఉండాలని బాషా కబురంపారు. ఈ సమయంలోనే.. కొత్త సెక్రటరీ నియామకంపై బాషా భగ్గుమన్నట్టు సమాచారం. తన ఇలాకాలో తన అనుమతి లేకుండా ప్రభుత్వం కూడా ఏమీ చేయడానికి వీల్లేదంటూ హుంకరించినట్టు తెలిసింది. ఎంతసేపు ఎదురుచూసినా బాషా నుంచి స్పందన లేకపోవడం.. ఇటు తన గదిలోకి వెళ్లే వీలు లేకపోవడంతో ఆంజనేయులు అవమానభారంతో అక్కడినుంచి వెనుదిరిగారు. జీఏడీ సెక్రటరీ శేషగిరిబాబుకు జరిగిన విషయమంతా సమాచారం అందించారు. మంగళవారం సీఎస్‌ విజయానంద్‌ను కలిసి నివేదించాలని ఆంజనేయులు భావిస్తున్నారని సమాచారం. ఆర్‌ఐటీ విషయంలో సుప్రీంకోర్టుతో మాట పడరాదని ప్రభుత్వం కొత్త సెక్రటరీ నియామకం, కోర్టుకు ఇవ్వాల్సిన నివేదిక తయారీ, ఇతర పనులను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌టీఐ చీఫ్‌ కమిషనర్‌ తీరు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.

Updated Date - May 06 , 2025 | 04:35 AM