Share News

Tirumala Dance Fraud: తిరుమలలో నృత్య ప్రదర్శనల పేరుతో రూ.35 లక్షల వసూలు

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:07 AM

తిరుమలలో నృత్య ప్రదర్శనల పేరిట కళాకారుల నుంచి రూ.35 లక్షలు వసూలు చేసిన వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్ట్‌ చేశారు....

Tirumala Dance Fraud: తిరుమలలో నృత్య ప్రదర్శనల పేరుతో రూ.35 లక్షల వసూలు

  • ఖాజీపేట వాసి అరెస్ట్‌

తిరుమల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో నృత్య ప్రదర్శనల పేరిట కళాకారుల నుంచి రూ.35 లక్షలు వసూలు చేసిన వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా ఖాజీపేటకు చెందిన సూత్రపు అభిషేక్‌(28) తిరుమలలోని ఆస్థాన మండపంలో ‘శ్రీనివాస కళార్చన’ పేరుతో రెండ్రోజుల నృత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని ప్రకటించాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 93 కళాబృందాల్లోని 2,900 మంది కళాకారుల నుంచి రూ.35 లక్షలు వసూలు చేశాడు. కొందరు కళాకారులు ఫిర్యాదు చేయడంతో ప్రదర్శనలకు ఇచ్చిన అనుమతిని టీటీడీ హిందూ ధార్మిక ప్రచార పరిషత్‌ రద్దు చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలతో ప్రదర్శనలకు జూన్‌ 27, 28వ తేదీల్లో అనుమతిచ్చారు.


పరిమితికి మించి తిరుమలకు చేరుకున్న కళాకారులు ప్రదర్శనకు అవకాశం ఇవ్వలేదంటూ నిరసనకు దిగడంతో ఈ అంశం రచ్చకెక్కింది. కేసు నమోదు చేసిన వన్‌టౌన్‌ పోలీసులు మంగళవారం అభిషేక్‌ను అరెస్ట్‌ చేసి, రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తిరుపతి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్‌ విధించింది.

Updated Date - Jul 03 , 2025 | 04:07 AM