Borugadda Anil: బోరుగడ్డ బొంకులు!
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:50 AM
‘ఇంత జరిగిందా’ అని అధికారవర్గాలు ఉలిక్కిపడ్డాయి. తల్లికి ఊపిరితిత్తులు, గుండె సంబంఽధిత సమస్యలున్నందున... ఆమెకు చికిత్స చేయించాలంటూ బోరుగడ్డ అనిల్ బెయిలుకోసం హైకోర్టును ఆశ్రయించాడు.
బెయిలు పొడిగింపు కోసం నాటకాలు
తల్లికి అనారోగ్యం నిజమే!
అనిల్‌కు బెయిలు రాకముందే ఆస్పత్రిలో చేరిక
18న సర్జరీ, 23న డిశ్చార్జి
తొలి విడతలో 28 దాకా బెయిలుపై అనిల్
పొడిగింపు పొందేందుకు తప్పుడు మార్గం
నకిలీ మెడికల్ సర్టిఫికెట్‌తో హైకోర్టుకు టోకరా
బెయిల్ రద్దుకు పోలీస్ పిటిషన్
(గుంటూరు/అమరావతి - ఆంధ్రజ్యోతి)
కొడుకు ఎలాంటి వాడైనా సరే... తల్లి బాగోగులు చూసుకోవాల్సిందే! కానీ... తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో హైకోర్టును బురిడీ కొట్టించి, బెయిలు పొందితే? వైసీపీ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ చేసింది ఇదే! ‘మాయమైపోయాడు’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘ఇంత జరిగిందా’ అని అధికారవర్గాలు ఉలిక్కిపడ్డాయి. తల్లికి ఊపిరితిత్తులు, గుండె సంబంఽధిత సమస్యలున్నందున... ఆమెకు చికిత్స చేయించాలంటూ బోరుగడ్డ అనిల్ బెయిలుకోసం హైకోర్టును ఆశ్రయించాడు. మానవీయ కోణం లో పరిశీలించిన న్యాయస్థానం... ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 28వరకు అనిల్‌కు బెయిలు మంజూరు చేసింది. బోరుగడ్డ తల్లి పద్మావతికి అనారోగ్యం నిజమే! ఆమెకు చెన్నై అపోలోలో శస్త్ర చికిత్స జరగడమూ నిజమే! అయితే... బోరుగడ్డ అనిల్‌కు బెయిలు రావడానికి రెండు రోజుల ముందే, అంటే గతనెల 12వ తేదీనే ఆమె ఆస్పత్రిలో చేరారు. 18వ తేదీన ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. 23న డిశ్చార్జి అయ్యారు. బోరుగడ్డ 28 వరకు బెయిలుపైనే ఉన్నాడు.
మళ్లీ రెండోసారి...
హైకోర్టు ఆదేశాల మేరకు గతనెల 28న బోరుగడ్డ అనిల్ రాజమండ్రి జైలులో లొంగిపోయాడు. అయితే... ఈనెల 1న తన మధ్యంతర బెయిలు పొడిగించాలంటూ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన తల్లికి శస్త్రచికిత్స జరిగినందున కొన్నాళ్లపాటు ఆమె బాగోగులు చూసుకోవాలని నిజాయితీగా కోరితే సరిపోయేది! కానీ... ఇక్కడ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. గత నెల 23నే ఆమె డిశ్చార్జి అయినప్పటికీ... ‘ఆమె ఇంకా చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్నారు’ అని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అంతేకాదు... ‘ఆమె పరిస్థితి క్షీణిస్తోంది. అత్యవసరంగా ఆమె ను చెన్నై అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందించాలి’ అంటూ గుంటూరు లలితా హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ శర్మ ఇచ్చినట్లుగా ఒక నకిలీ మెడికల్ సర్టిఫికెట్‌ను కోర్టు ముందుంచాడు. అది అసలుదే అనే సమాచారం తనకు లేదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్పుడే చెప్పారు. అయితే... మానవీయ కోణంలో చూసిన హైకోర్టు, బోరుగడ్డ అనిల్‌కు ఈనెల 11వ తేదీ వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది. సర్టిఫికెట్ నకిలీదని తేలితే చర్యలు తీసుకోవాలని బెయిలు ఉత్తర్వుల్లోనే స్పష్టం చేసింది.
బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్
కోర్టుకు నకిలీ సర్టిఫికెట్ అందించి బెయిల్ పొడిగింపు పొందినట్లు తేలడంతో అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు నుంచి వచ్చే ఉత్తర్వుల కోసం గుంటూరు, అనంతపురం జిల్లాల పోలీసులు ఎదురుచూస్తున్నారు. దీనిపై క్రిమినల్ చర్యలకు హైకోర్టు ఆదేశిస్తే బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు నమోదయ్యే అవకాశముంది. దీంతోపాటు డాక్టర్ లెటర్ హెడ్ సృష్టించిన వ్యక్తులు, రబ్బర్ స్టాంపు తయారు చేసిన వారిని కూడా ఇందులో నిందితులుగా చేర్చడం ఖాయమని తెలుస్తోంది.
ఆ సర్టిఫికెట్ నకిలీదే
తాను ఇచ్చినట్లుగా హైకోర్టుకు బోరుగడ్డ అనిల్ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నకిలీదే అని ప్రముఖ వైద్యులు, లలితా హాస్పిటల్ ఎండీ డాక్టర్ రాఘవ శర్మ పోలీసులకు స్పష్టం చేశారు. సర్టిఫికెట్‌లోని సంతకం తనది కాదని ఆయన పోలీసులకు తెలిపారు. అనిల్ సృష్టించిన సర్టిఫికెట్‌లోని తేదీ ఉన్న రోజుకు సంబంధించిన ఆసుపత్రి సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలించారు. అనిల్ గాని, ఆయన తల్లి గాని ఆస్పత్రికి రాలేదని నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్‌ఆఫ్ వస్తోంది. గుంటూరులోని ఆయన ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఆయన కదలికలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఎవరికి చెప్పారు సార్?
బోరుగడ్డ విడుదలపై జైలు అధికారి దబాయింపు
బోరుగడ్డ అనిల్‌ను ‘అలా వదిలేస్తారా?’ అని ప్రశ్నించడంపై రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ స్పందించారు. తాము బెయిలు నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, విడుదల సమయంలో మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. సంబంధిత జిల్లాల పోలీసులకు మాత్రం సమాచారమిచ్చామని పేర్కొన్నారు. కానీ... రెండు జిల్లాల ఎస్పీలు, అనంతపురం నాలుగో పట్టణ పోలీసులను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, అనిల్ విడుదలపై రాజమండ్రి సెంట్రల్‌జైలు నుంచి తమకు ఎలాం టి సమాచారం రాలేదని స్పష్టం చేశారు. బెయులుపై ఉన్న వ్యక్తి కదలికలు గమనించేందుకు స్థానిక పోలీసులకు, కేసు నమోదైన పోలీసు స్టేషన్‌కు జైలు అధికారులు సమాచారమివ్వాలి. కానీ... రాహుల్ ఎవరికి, ఏ రూపంలో సమాచారం పంపారో మరి!
ఇవి కూడా చదవండి...
Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..
Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ
Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..
Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..