AP DGP Harish Kumar Gupta: ఏఐతో పోలీసింగ్‌లో విప్లవాత్మక మార్పులు
ABN , Publish Date - Jun 03 , 2025 | 02:40 AM
ఏఐ సాంకేతికతతో పోలీసింగ్‌లో నాణ్యతను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. ఈనెల 27 నుంచి 29 వరకు గుంటూరులో ఏఐ హ్యాకథాన్ నిర్వహించనున్నారు.
ఈనెల 27 నుంచి 29 వరకు ‘ఏఐ హ్యాకథాన్’
డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడి
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మరింత నాణ్యమైన పోలీసు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుని పోలీసుల పనితీరులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ద్వారా సమస్యల్ని అధిగమించి సేవల్లో నాణ్యత పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అందులో భాగంగా ఈనెల 27న సీఎం చేతుల మీదుగా గుంటూరులోని ఆర్.వి.ఆర్ అండ్ జె.సి ఇంజనీరింగ్ కళాశాలలో ‘ఏఐ హ్యాకథాన్’ ప్రారంభిస్తున్నామని, ఇది 29 వరకు జరుగుతుందని పేర్కొన్నారు. హ్యాకథాన్‌కు సంబంధించిన వెబ్‌సైట్ https://aiandhrapolice.-com, లోగోను డీజీపీ సోమవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల అవసరాల కోసం అధునాతన ఏఐ ప్రాజెక్టుల్ని ఆహ్వానిస్తున్నామని అన్నారు. హ్యాకథాన్‌కు అన్ని రాష్ట్రాల నుంచి ప్రముఖ ఐటీ కంపెనీలు, ఏఐ స్టార్ట్‌పలు, ఐటీ అండ్ జనరేటివ్ ఏఐ ప్రొఫెషనల్స్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. అధునాతన సాంకేతికత సమర్థ వినియోగం, విచారణలో కచ్చితత్వంతోపాటు నాణ్యత, పోలీసులకు కాలానుగుణంగా ఎదురవుతోన్న సవాళ్ల పరిష్కారానికి సహకారం అందించాలని కోరారు.