Anagani Sathya Prasad : పకడ్బందీగా రీసర్వే
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:26 AM
భూముల రీసర్వేను పకడ్బందీగా పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.

698 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు: రెవెన్యూ మంత్రి అనగాని
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): భూముల రీసర్వేను పకడ్బందీగా పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల్లో భూవివాదాలపై ఫిర్యాదులు అనే ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో అధికారులను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు భూకబ్జాలు చేశారని తెలిపారు. జనవరి 20 తర్వాత చాలా జాగ్రత్తగా రీసర్వే ప్రారంభించామన్నారు. రోజుకు 20 ఎకరాల చొప్పున సర్వే చేయాలని, 250 ఎకరాలను ఒక బ్లాక్‌గా మార్చినట్లు తెలిపారు. 698 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టడంతో పాటు 1,200 గ్రామాల్లో రెండో విడత రీసర్వే చేపడతామని పేర్కొన్నారు. ప్రతి 1,200 గ్రామాలకు 4నెలల సమయం ఇచ్చి రీసర్వే చేపడతామని వివరించారు. కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను సీఎం చంద్రబాబు రద్దు చేశారని, అలాగే రీసర్వే జరిగిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టాలని ఆదేశించారని గుర్తుచేశారు. అంతకుముందు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడి రీసర్వేను గందరగోళం చేశారని ఆరోపించారు.