Annamayya Keerthanas: అభినవ అన్నమయ్య గరిమెళ్ల అస్తమయం
ABN , Publish Date - Mar 10 , 2025 | 02:55 AM
6వేలకు పైగా కచేరీలు చేశారు. ప్రత్యేకించి ‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’, ‘జగడపు చనువుల జాజర’, ‘తిరువీధుల మెరసీ దేవదేవుడు’, ‘సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట’, ‘ఇతడొకడే సర్వేశ్వరుడు’, ‘నమో నారాయణాయ నమో’ వంటి కీర్తనలు ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చాయి.
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు బాలకృష్ణ ప్రసాద్ తుదిశ్వాస
600కు పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి వెలుగులోకి
తెలుగునాట సంకీర్తనా యజ్ఞ ప్రక్రియకు ఆద్యుడిగా ఘనత
ఇద్దరు కుమారులూ అమెరికాలో..
ఎల్లుండి అంత్యక్రియలు
తిరుపతి/అమరావతి/యాదగిరిగుట్ట, మార్చి 9(ఆంధ్రజ్యోతి): అభినవ అన్నమయ్యగా కీర్తినందుకున్న టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్(76) ఇక లేరు. తిరుపతి భవానీనగర్‌లో నివాసం ఉంటున్న ఆయన ఆదివారం సాయం త్రం గుండెపోటుతో కన్నుమూశారు. ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ప్రఖ్యాతి గాంచిన గరిమెళ్ల 600కు పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరచి వెలుగులోకి తెచ్చారు. 6వేలకు పైగా కచేరీలు చేశారు. ప్రత్యేకించి ‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’, ‘జగడపు చనువుల జాజర’, ‘తిరువీధుల మెరసీ దేవదేవుడు’, ‘సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట’, ‘ఇతడొకడే సర్వేశ్వరుడు’, ‘నమో నారాయణాయ నమో’ వంటి కీర్తనలు ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చాయి.

సంప్రదాయ కర్ణాటక సంగీతంతో పాటు లలిత సంగీతం, జానపద సంగీతంలోనూ ఆయన సుప్రసిద్ధులు. సిలికానాంధ్ర సంస్థ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన లక్ష గళార్చనలో బాలకృష్ణ ప్రసాద్ ప్రధాన గాయకులు. ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో నమోదైంది.
శ్రీవారి సేవకే అంకితం
1948లో రాజమండ్రిలో కృష్ణవేణి, నరసింహరావు దంపతులకు గరిమెళ్ల జన్మించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్.జానకి ఈయనకు స్వయాన పిన్ని. మృదంగ విద్వాంసులైన తండ్రి నుంచి సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నారు. 1978లో టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టులో గాయకుడిగా చేరిన ఆయన 2006లో ఉద్యోగ విరమణ పొందారు. 2012 నుంచి 2023 వరకూ టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా కొనసాగారు. అన్నమయ్య కీర్తనలను ప్రపంచవ్యాప్తం చేశారు. నేదునూరి కృష్ణమూర్తి, పశుపతి వంటి గురువుల వద్ద శిక్షణ పొందిన ఆయన 300 కీర్తనలను నాన్‌స్టా్‌పగా పాడారు. ఎందరో శాస్త్రీయ కచేరీలు చేసినా తెలుగునాట సంకీర్తనా యజ్ఞ ప్రక్రియను తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత గరిమెళ్లకే దక్కుతుంది. హరి సంకీర్తన ద్వారా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. సినిమా అవకాశాలు వచ్చినా శాస్త్రీయ సంగీతానికి, స్వామివారి సేవకు జీవితాన్ని అంకితం చేశారు. 2020లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. అపర అన్నమయ్య, అన్నమాచార్య సంకీర్తనా మహతి బిరుదులు స్వీకరించారు. గరిమెళ్ల మంచి భక్తి గీత రచయిత కూడా. శ్రీవేంకటేశ్వర స్వామి సేవకులుగా ఉన్నప్పటికీ ఆయన స్వతహాగా హనుమాన్ భక్తులు. 21 ఆంజనేయ కృతులు రచించి స్వరపరిచారు. వినాయకుడిపై 50 కృతులు రచించారు. దాదాపు 150 శివ పద కీర్తనలను స్వరపరచి ఆలపించారు. వెయ్యికి పైగా కీర్తనలు రచించి స్వరపరచి జన బాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు. ఆయన స్వరపరచిన సంకీర్తనలను టీటీడీ అనేక పుస్తకాలుగా ప్రచురించింది. టీటీడీతో పాటు కంచి కామకోటి పీఠం, అహోబిల మఠం ఆస్థాన సంగీత విద్వాంసులుగా సేవలు అందించారు. రాజమండ్రి వాస్తవ్యులైన గరిమెళ్ల... తిరుపతిలో స్థిరపడి అన్నమయ్య అంశగా గుర్తింపు పొందారు. కాగా, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు భార్య రాధ, కుమారులు పవన్ కుమార్, అనిల్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం కుమారులిద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరు రావడం ఆలస్యం కానుండటంతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన ఆయన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గరిమెళ్ల.. తన మధుర గాత్రంతో శ్రీవేంకటేశ్వరుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారని, అలాంటి మహనీయుడు మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, గరిమెళ్ల మృతి పట్ల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 6న తెలంగాణలోని యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారని తెలిసి సంగీతప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Read more :
Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?
Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
For AndhraPradesh News And Telugu News