Ratan Tata Innovation Hub: ఆవిష్కరణ @ ఆంధ్రా
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:44 AM
క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధతో అమరావతి నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సృజనాత్మక ఆవిష్కరణలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని మయూరి టెక్‌పార్క్‌లో..
అమరావతి సహా 6చోట్ల టాటా
ఇన్నోవేషన్ హబ్‌లు ప్రారంభం
క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధతో ప్రపంచ పటంలో అమరావతిని నిలుపుతా
స్టార్ట్‌పలకు రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ఊతం
అమరావతిలో ఇన్నోవేషన్ హబ్‌కు సీఎం శ్రీకారం
విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి విజయవాడల్లోనూ ప్రాంతీయ ఇన్నోవేషన్ హబ్‌లు
బాబు దార్శనికతతో హబ్‌కు రూపం: చంద్రశేఖరన్
175 నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తాం
పీ-4 కింద పేదరిక నిర్మూలనకు ప్రయత్నం: సీఎం

చంద్రబాబుకు రోబో స్వాగతం
ముఖ్యమంత్రి కార్యక్రమం అనగానే.. అధికారులు, నాయకుల హడావుడి, ప్రొటోకాల్, స్వాగత ఏర్పాట్లు మామూలుగా ఉండవు. ఇది అందరికీ తెలిసిన సంగతే. అయితే సీఎం చంద్రబాబుకు ఊహించని, వినూత్న స్వాగతం లభించింది. జాగిలం ఆకారంలో ఉన్న ఓ రోబో ఆయనకు ఎదురుగా వచ్చి ఇలా హాయ్ చెప్పి, వెనుక కాళ్లపై లేచి నిల్చుని నమస్కారం చేసింది. రోబోను చూసి ముచ్చటపడ్డ చంద్రబాబు కూడా సంతోషంతో ప్రతి నమస్కారం చేశారు. బుధవారం మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌లో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ కార్యక్రమంలో వివిధ ఆవిష్కరణలను ముఖ్యమంత్రి తిలకించారు.
అమరావతి/మంగళగిరి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధతో అమరావతి నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సృజనాత్మక ఆవిష్కరణలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని మయూరి టెక్‌పార్క్‌లో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రతన్‌టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలన్న సంకల్పంతో రాష్ట్రంలో ఆయన పేరిట ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించామన్నారు. అదేవిధంగా విశాఖ, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, విజయవాడల్లో ప్రాంతీయ ఇన్నోవేషన్ హబ్‌లు కూడా వర్చువల్‌గా ప్రా రంభించామని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ముఖ్యంగా అగ్రిటెక్‌లో ఇన్నోవేషన్‌కు విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించాలన్న ఆలోచనను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన సానుకూలత వ్య క్తం చేయడంతో పాటు సలహాలు ఇస్తానని చెప్పారన్నారు.

రతన్‌టాటా సేవలు దేశానికే ఆదర్శం
‘‘రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతి కేంద్రంగా పనిచేస్తుంది. గివ్ బ్యాక్ టూ సొసైటీ అనే విధానాన్ని రతన్‌టాటా ఆచరించి సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన చేసిన సేవలు దేశానికే ఆదర్శం. ఆయన భరతమాత ముద్దుబిడ్డ కావడం గర్వకారణం. రతన్‌టాటా నిజాయితీపరుడు. సామాన్యుడిలా జీవించినా, ఆయన ఆలోచనలు మాత్రం ఎంతో ఎత్తులో ఉండేవి. ఆయన పేరు మీద ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించడం రాష్ట్రానికి చరిత్రాత్మక అవసరం. సరైన ప్రభుత్వ విధానాలు అవలంభిస్తే ఆదాయం, సంపద వస్తుంది. భవిష్యత్తు అంతా ఐటీ రంగానిదే. దేశంలో ఎవరూ చేయలేనంతగా నేను ముఖ్యమంత్రిగా ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు వచ్చేలా చేశాను. పదేళ్లనాడు పదకొండో ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. అప్పుడు దేశ సంపద మరింతగా పెరుగుతుంది. రానున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సంసిద్ధంగా ఉండాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రాంతాలవారీగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నాం. ప్రస్తుతం అమెరికా, చైనాలతో పోటీ పడేందుకు మనం సిద్ధమవుతున్నాం. ఇందుకోసం అమరావతి సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఆర్థికాభివృద్ధి పెరగాలి’’ అని అన్నారు.

సంజీవని ప్రణాళికతో అందరికీ ఆరోగ్యం
‘‘ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే సంక్షేమాన్ని మరింత మిన్నగా అమలు చేయడానికి వీలవుతుంది. ఆదాయ వనరుల పెంపు కోసం ప్రతి నియోజకవర్గంలో ఓ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం డిజినెర్వ్ సెంటర్ ప్రాజెక్టులోనూ టాటాతో కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం దీనిని కుప్పం నియోజకవర్గంలో సంజీవని పేరుతో అమలు చేస్తున్నాం. దీని ద్వారా ప్రపంచంలో ఉన్న వైద్యచికిత్సల టెక్నాలజీని ఒకచోటకు చేర్చి ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్నదే లక్ష్యం’’ అని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, మంత్రులు లోకేశ్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, భారత్ ఫోర్డ్ చైర్మన్ బాబా కల్యాణి, అమర్‌రాజా బ్యాటరీస్ చైర్మన్ గల్లా జయదేవ్, ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు.
నేను విభిన్నంగా ఆలోచిస్తా
‘‘నేను విభిన్నంగా ఆలోచిస్తా. 1995లో టెలికామ్ విప్లవం వచ్చేందుకు నేనూ ఒక కారణం. అప్పట్లో స్వదేశీ ఫోన్‌కాల్స్ కోసం బీఎ్‌సఎన్‌ఎల్, విదేశీ కాల్స్ కోసం వీఎ్‌సఎన్‌ఎల్ ఉండేవి. నాటి ప్రధాని వాజ్‌పేయి తో మాట్లాడి ఫోన్‌ల రంగంలో ప్రైవేటు సంస్థలు రావాలని సూచించాను. టెలికామ్ రంగం గురించి నేను ప్రస్తావించినప్పుడు.. డబ్బుల గురించి ప్రశ్నించారు. టెలికామ్ రంగంలోకి ఽధీరూబాయ్ అంబానీని రప్పించడంలో సఫలమయ్యాను’’ అని చంద్రబాబు తెలిపారు.
రిజిస్ట్రేషన్లలో గిన్నిస్ రికార్డు
ఏపీలో ఇన్నోవేషన్, బిజినెస్ స్టార్ట్‌పల కోసం కేవలం 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 1,67,321 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఘనత సాధించిన ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి గిన్నిస్ రికార్డు లభించింది. ముఖ్యమంత్రికి చంద్రబాబుకు గిన్నిస్ రికార్డును ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ స్టార్టప్ కంపెనీలు మయూరి టెక్‌పార్కులో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ వివిధ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. వాటిని సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు.

స్టార్ట్‌పలకు సహకారం: చంద్రశేఖరన్
సీఎం చంద్రబాబు దార్శనికతతో కొద్ది సమయంలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూపమిచ్చారని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అభినందించారు. వినూత్న ఆవిష్కరణలు సమష్ఠి కృషి అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో స్టార్ట్‌పలకు సహకారం అందిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం స్టార్ట్‌పలకు మంచి అవకాశాలున్నాయన్నారు.