Share News

Srisailam Reservoir: జూన్‌ ముగుస్తున్నా చినుకు కోసం చింతే

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:16 AM

నైరుతి ముందే వచ్చేసింది. మే నెలలో వర్షాలు దంచికొట్టాయి. తీరా జూన్‌ నెల వచ్చేసరికి ముఖం చాటేశాయి. అడపా దడపా కురుస్తున్న వర్షాలతో పొలాలను దుక్కిదున్ని సిద్ధం చేసుకున్న రైతులు.. వర్షాలు కురిస్తే నారుమళ్లు పోసుకుందామని చూస్తున్నారు.

Srisailam Reservoir: జూన్‌ ముగుస్తున్నా చినుకు కోసం చింతే

  • ఊరించి.. ఉసూరుమనిపించిన వానలు

  • పలు జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదు

  • నారుమళ్లకు నీటి కోసం రైతుల ఎదురుచూపులు

  • ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌లకు భారీగా వరద

  • దిగువన నెమ్మదిగా నిండుతున్న రిజర్వాయర్లు

అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): నైరుతి ముందే వచ్చేసింది. మే నెలలో వర్షాలు దంచికొట్టాయి. తీరా జూన్‌ నెల వచ్చేసరికి ముఖం చాటేశాయి. అడపా దడపా కురుస్తున్న వర్షాలతో పొలాలను దుక్కిదున్ని సిద్ధం చేసుకున్న రైతులు.. వర్షాలు కురిస్తే నారుమళ్లు పోసుకుందామని చూస్తున్నారు. వాతావరణం చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. ఓరోజు వర్షం దంచికొడితే.. ఇంకోరోజు ఎండ మాడుపగలకొడుతోంది. అనిశ్చిత వాతావరణ పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బాగానే వర్షాలు పడినా.. ఇంకొన్ని జిల్లాల్లో తక్కువ వర్షాలతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. శ్రీసత్యసాయి, చిత్తూరు, కడప, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఈ సీజన్‌లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో.. ఈ జిల్లాలు చినుకు కోసం ఎదురుచూస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 19 శాతం తక్కువగా నమోదయ్యింది.. పల్నాడులో 16 శాతం మేర వానలు తక్కువగా పడ్డాయి. చిత్తూరులో 10, కడపలో 29, అన్నమయ్యలో 18, అనంతపురంలో 6 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని జల వనరుల శాఖ వెబ్‌సైట్‌ ఏపీ రిమ్స్‌ శనివారం వెల్లడించింది.


రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 76.84 మిల్లీమీటర్లకుగాను 13.47శాతం తక్కువగా అంటే 66.49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌ నెలలో ఇప్పటిదాకా శ్రీకాకుళంలో 37.5, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 29, పల్నాడులో 52.9, నెల్లూరులో 58.8, నంద్యాలలో 23.7, శ్రీసత్యసాయి జిల్లాలో 45.8, కడపలో 65.5, అన్నమయ్యలో 63.1, చిత్తూరులో 43.4, తిరుపతిలో 27.4 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది.

రాష్ట్రంలోని రిజర్వాయర్లు వెలవెల

రాష్ట్రంలోని 110 రిజర్వాయర్లలో 482.64 టీఎంసీలకుగాను 233.21 టీఎంసీల జలాలే నిల్వ ఉన్నాయి. 38,456 చెరువుల్లో 66.92 టీఎంసీలకుగాను 22.65 టీఎంసీలే నిల్వ ఉంది. మేజర్‌ రిజర్వాయర్లలో 865.54 టీఎంసీలకుగాను 201.25 టీఎంసీలే నీటి నిల్వలు ఉన్నాయి. మీడియం రిజర్వాయర్లలో 137 టీఎంసీలకుగాను 33 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి.

ఎగువన ప్రాజెక్టుల్లోకి భారీగా చేరుతున్న నీరు

ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి గరిష్ఠ సామర్థ్యం 129.72 టీఎంసీలకుగాను 84.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయరులోకి 1,14,327 క్యూసెక్కుల వరద వస్తుంటే.. 80,415 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ గరిష్ఠ సామర్థ్యం 37.64 టీఎంసీలకుగాను 30.53 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 80,448 క్యూసెక్కుల వరద వస్తుంటే.. 76,391 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. జూరాల గరిష్ఠ సామర్థ్యం 9.66 టీఎంసీలకుగాను 7.33 టీఎంసీల నీరు ఉంది. జూరాలకు 1,08,921 క్యూసెక్కుల వరద వస్తుంటే.. 1,11,035 క్యూసెక్కులను దిగువన శ్రీశైలానికి వదులుతున్నారు.


నెమ్మదిగా నిండుతున్న శ్రీశైలం

శ్రీశైలం జలాశయం గరిష్ఠ సామర్థ్యం 215.81 టీఎంసీలకుగాను 139.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌లోకి 1,05,783 క్యూసెక్కుల వరద వస్తుంటే.. దిగువకు ఏమీ విడుదల చేయడం లేదు. నాగార్జున సాగర్‌ గరిష్ఠ సామర్థ్యం 514.2 టీఎంసీలకుగాను 138.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌లోకి 4,484 క్యూసెక్కుల వరద వస్తుంటే.. ఆ నీటిని తాగునీటి కోసం దిగువకు వదులుతున్నారు. పులిచింతల గరిష్ఠ సామర్థ్యం 45.77 టీఎంసీలకుగాను 22.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌లోకి వరద నీరు రావడం లేదు. ప్రకాశం బ్యారేజీ గరిష్ఠ నీటి మట్టం 3.07 టీఎంసీలకుగాను 2.98 టీఎంసీల నీరు ఉంది. ఎగువన వర్షాలతో ప్రాజెక్టులు నిండుతున్నా.. రాష్ట్రంలో తక్కువ వర్షపాతం.. ఎగువ నుంచి వరద ప్రవాహాలు తక్కువగా ఉండటంతో ప్రాజెక్టుల్లోకి నీరు ఆశించినంతగా చేరడం లేదు

Updated Date - Jun 29 , 2025 | 03:16 AM