Share News

PSR Anjaneyulu Custody: దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారనే అరెస్టు

ABN , Publish Date - May 23 , 2025 | 05:51 AM

సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుపై దర్యాప్తుకు ఆటంకం కలుగుతున్నదంటూ హైకోర్టు విచారిస్తోంది. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 29వ తారీఖుకు వాయిదా వేసారు.

PSR Anjaneyulu Custody: దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారనే అరెస్టు

  • ఏవిధంగా ఆటంకం కలిగిస్తారో చెప్పండి: హైకోర్టు

  • పీఎస్‌ఆర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 29కి వాయిదా

  • గ్రూప్‌-1 కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వండి

  • విజయవాడ కోర్టులో పోలీసుల పిటిషన్‌

అమరావతి/విజయవాడ, మే 22(ఆంధ్రజ్యోతి): సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో బెయిల్‌ కోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌, ఇతర పోలీసు అధికారులు కేసు నమోదుకు ముందే జెత్వానీ విషయంలో కుట్ర పన్నారన్నారు. అప్పటి ఇంటెలిజెన్స్‌ డీజీ సూచనలు మేరకే తాను ముంబై వెళ్లానని ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్ని డిపార్ట్‌మెంట్‌ విచారణలో కమిషనర్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. ఉన్నతస్థానాల్లో ఉన్న అధికారులు జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని పేర్కొన్నారు. పిటిషనర్‌ దర్యాప్తును ఏవిధంగా ఆటంకం కలిగిస్తారు? సాక్షులను ఏవిధంగా ప్రభావితం చేస్తారో? వాదనలు వినిపించాలని ఏజీకి సూచిస్తూ విచారణను ఈనెల 29కి వాయిదా వేశారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులుపై నమోదు చేసిన కేసు వివరాలు తమ ముందు ఉంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.

పీఎస్ఆర్‌ రిమాండ్‌ పొడిగించిన విజయవాడ కోర్టు

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 డిజిటల్‌ మూల్యాంకనంలో అక్రమాలపై కేసులో ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుకు రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏ1, ఏ2గా పీఎస్ఆర్‌, పమిడికాల్వ మధుసూదన్‌ను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సూర్యారావుపేట పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

Updated Date - May 23 , 2025 | 05:52 AM