Share News

Exam Postponement : గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా కోసం అభ్యర్థుల ఆందోళన

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:28 AM

విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం వద్దకు వెళ్లిన అభ్యర్థులు చైర్‌పర్సన్‌ అనూరాధను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు.

Exam Postponement : గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా కోసం అభ్యర్థుల ఆందోళన

  • బెజవాడలో ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద బైఠాయింపు

  • అధికారులకు వినతిపత్రం అందజేత

  • విశాఖపట్నంలో హైవేపై స్తంభించిన ట్రాఫిక్‌

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ అభ్యర్థులు రాష్ట్రంలోని పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం వద్దకు వెళ్లిన అభ్యర్థులు చైర్‌పర్సన్‌ అనూరాధను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు. పోలీసులు బారికేడ్లతో వారిని అడ్డుకున్నారు. దీంతో అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పరీక్షలు వాయిదా వేయాలని నినాదాలు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లోని రోస్టర్‌ విధానంలో ఉన్న తప్పులను సవరించాలని కోరుతున్నా.. అధికారులు స్పందించడం లేదని అన్నారు. ఈ విధానంలో పరీక్షలు నిర్వహిస్తే, ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పరీక్షను వాయిదా వేయమని కోరిందని.. అయితే ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌ మొండి వైఖరి అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల అభ్యర్ధనతో కొందరిని పోలీసులు ఏపీపీఎస్సీ కార్యాలయానికి తీసుకువెళ్లగా.. అధికారులకు వినతిపత్రం అందజేశారు. రోస్టర్‌ విధానంలో సవరణలు చేసిన తర్వాతే పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాత్రి వందల మంది అభ్యర్థులు విశాఖపట్నంలోని ఇసుక తోట జంక్షన్‌లో జాతీయ రహదారిపై బైఠాయించారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఎంవీపీ కాలనీలోని సర్కిల్‌ వద్ద ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి ర్యాలీగా ఇసుక తోట జంక్షన్‌కు చేరుకున్నారు. అభ్యర్థుల ఆందోళనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. కాగా, రోస్టర్‌ సమస్య పరిష్కరించకుండా పరీక్షలు జరిగితే ఇబ్బంది అని, ఇటీవల ఝార్ఖండ్‌లో ఉద్యోగాలు ఇచ్చి రద్దు చేశారని ఏపీ స్టేట్‌ వెటర్నరీ కౌన్సిల్‌ చైర్మన్‌ పారా లక్ష్మయ్య పేర్కొన్నారు. పరీక్ష రద్దు కోరుతూ సీఎంవోలో, సీఎన్‌కు వినతిపత్రం ఇచ్చానన్నారు. మరోవైపు గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసిందంటూ సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Feb 23 , 2025 | 04:29 AM