Srisailam : శ్రీగిరిపై నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:55 AM
బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేశారు. ప్రముఖులకు 4 విడతలుగా బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
శ్రీశైలం, అమరావతి: ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో బుధవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేశారు. ప్రముఖులకు 4 విడతలుగా బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు, పాదయాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాగా, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును దేవదాయశాఖ అధికారులు ఆహ్వానించారు. మంగళవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, వేదపండితులు ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకుని ఆయనకు బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రిక అందించారు.