Polavaram Project: పోలవరం పై 28న సీఎంలతో ప్రధాని సమావేశం
ABN , Publish Date - May 17 , 2025 | 03:30 AM
పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రధాని మోదీ మే 28న తొలిసారిగా సీఎం చంద్రబాబు తదితరులతో సమీక్ష నిర్వహించనున్నారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలో పనులు మళ్లీ వేగం పొందాయి.
చంద్రబాబు, రేవంత్‌రెడ్డితోపాటు ఛత్తీ్‌సగఢ్, ఒడిసా సీఎంలూ హాజరు
మోదీ సయోధ్య కుదురుస్తారని జలవనరుల శాఖ ఆశాభావం
అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జీవన రేఖ పోలవరం ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రధాని మోదీ తొలిసారి సమీక్ష జరుపనున్నారు. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆంధ్ర, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో పాటు ఒడిసా, ఛత్తీ్‌సగఢ్ ముఖ్యమంత్రులు మోహన్ చరణ్ మాజీ, విష్ణుదేవ్ సాయి, ఆయా రాష్ట్రాల జల వనరుల మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. ఈ సమాచారాన్ని ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు గురువారం పంపింది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం పాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించిన సంగతి తెలిసిందే. అలాగు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్రానికే అప్పగించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. దీనికి కేంద్ర జలశక్తి శాఖ సానుకూలంగా స్పందించింది. దీంతో నిర్మాణ బాధ్యతలను 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షిస్తోంది. 2014-19 నడుమ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోల‘వారం’గా మార్చి.. సమీక్షలు నిర్వహించి.. ప్రఽధాన డ్యాం పనులు 72 శాతం వరకు పూర్తి చేయించారు. డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తిచేశారు. దానిపై ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం వేసేస్తే.. ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనులు పూర్తయిపోయేవి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. పోలవరాన్ని పూర్తి నిర్లక్ష్యం చేశారు.
కేంద్రం వద్దని మొత్తుకున్నా కాంట్రాక్టు సంస్థను మార్చేశారు. ఈ క్రమంలో ఏడాది పాటు పనులు చేయలేదు. ఫలితంగా 2020లో గోదావరికి వరద ఉధృతి పెరగడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. దీంతో ప్రధాన డ్యాం పనులు నిలిచిపోయాయి. 2024లో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టాక.. మళ్లీ ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. అమెరికా, కెనడా నిపుణుల సూచన మేరకు కొత్త డయాఫ్రం వాల్.. సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు కూడా చేపట్టేందుకు ప్రాజెక్టు అధికారులు సిద్ధమయ్యారు. పోలవరాన్ని 2027 జూన్‌నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరుణంలో 28న ప్రధాని సమీక్ష చేయనుండడం గమనార్హం. ఈ సందర్భంగా తెలంగాణ, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాలు ముంపుపై ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తుతాయో.. ఆయన వాటిపై ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో ఆయన సయోధ్య కుదురుస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ ఆశాభావంతో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News