PM Modi Amaravati Visit: పీ-4 వేదిక ప్రాంతంలోనే ప్రధాని సభ
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:06 AM
ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం కోసం వస్తున్న సందర్భంగా, పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. మోదీ సభ P-4 వేదిక ప్రాంతంలో నిర్వహించబడుతుంది, అంగీకారాల ప్రారంభోత్సవాలు అక్కడి నుంచే జరుగుతాయని అధికారులు తెలిపారు.
అక్కడి నుంచే మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించేందుకు వస్తున్నందున పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బుధవారం అమరావతి సచివాలయంలో అధికారులతో సీఎస్ సమీక్షించారు. పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైద్యారోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్‌ను నోడల్ అధికారిగా నియమించామన్నారు. సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, నోడల్ అధికారి వీరపాండ్యన్ మాట్లాడుతూ అమరావతి సచివాలయం వెనుక పీ-4 కార్యక్రమం జరిగిన ప్రాంతంలోనే ప్రధాని సభా వేదిక ఉంటుందన్నారు. అక్కడి నుంచే ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. ప్రధాని సభలో సుమారు 5లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రధాన వేదిక వద్ద 50వేల మంది కూర్చునేవిధంగా, మరో లక్ష మంది రోడ్ల వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికేవిధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం సమీప జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా, మిగతా జిల్లాల నుంచి తగినవిధంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.