NDA Meeting: ఎన్డీయే పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో మోదీ మీటింగ్.. పవన్, చంద్రబాబుతో ప్రత్యేకంగా..
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:16 PM
ఢిల్లీలో ఎన్డీయే పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం జరిగింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశంలో పాల్గొన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ఢిల్లీలో ఎన్డీయే పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం జరిగింది. అలాగే బీజేపీ ఎన్డీయే నేతలకు ప్రత్యేక విందు ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి, ఎన్డీయే పక్షాల సీఎంల సమావేశానికి హాజరుకాలేదు. ఈ సమావేశంలో ప్రభుత్వాల పనితీరు ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా, డిప్యూటీ సీఎం పర్వేష్ సాహెబ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొత్తగా సీఎం, డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన ఈ ఇద్దరినీ ఎన్డీయే పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు అభినందించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, ప్రధాని మోదీ మాట్లాడారు. అభివృద్ధి అజెండాపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
చంద్రబాబు, పవన్‌తో ప్రత్యేకంగా..
ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏపీలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి.. రాజధాని అమరావతి పనులు స్థితిగతులను మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి అన్ని విధాలా తోడ్పాటు ఉంటుందని చెప్పగా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు చెప్పినట్లు సమాచారం. ఓవైపు ఏపీలో కూటమి నేతల మధ్య విబేధాలు ఉన్నాయంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ నేతలు ఈ తరహా విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికగా ఈ విమర్శలకు ప్రధాని మోదీ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. వేదికపై పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇద్దరితో చమత్కరించిన మోదీ మిగతా ఎన్డీయే నేతలతో పోలిస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో కూటమి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవనే విషయం స్పష్టమైంది.
మరింత సమన్వయంతో..
ఎన్డీయే సమావేశం పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ జాతీయ మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో గతంలో ఎన్డీయే సమావేశాలకు హాజరుకాలేదన్నారు. ఇప్పటికీ వెన్నునొప్పితో తాను బాధపడుతున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని, అన్ని హామీలు అమలుచేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here