Share News

CM Chandrababu Naidu: చంద్రబాబు, లోకేశ్‌ను చూసి అందరూ నేర్చుకోవాలి

ABN , Publish Date - Jun 26 , 2025 | 03:23 AM

యోగాంధ్ర’ను ప్రధాని మోదీ మరోసారి కొనియాడారు. ఈ నెల 21న వైజాగ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం తన అంచనాలను మించి విజయవంతమైందని ప్రశంసలు కురిపించారు.

CM Chandrababu Naidu: చంద్రబాబు, లోకేశ్‌ను చూసి అందరూ నేర్చుకోవాలి

యోగాంధ్ర అంచనాలకు మించి సక్సెస్‌..

దాన్ని అందరూ స్టడీ చేయాలి: ప్రధాని

  • ఏలా చేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని నివేదిక కోరా

  • దానిని అన్ని రాష్ట్రాలకూ పంపుతా.. క్యాబినెట్‌ భేటీలో మోదీ

  • చంద్రబాబు, లోకేశ్‌ కృషి అభినందనీయం: ప్రధాని

న్యూఢిల్లీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘యోగాంధ్ర’ను ప్రధాని మోదీ మరోసారి కొనియాడారు. ఈ నెల 21న వైజాగ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం తన అంచనాలను మించి విజయవంతమైందని ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దీనిని సక్సెస్‌ చేశారని బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి ముందు వ్యాఖ్యానించారు. ‘నేను చాలా యోగా కార్యక్రమాలు చూశాను. ‘యోగాంధ్ర’ స్ఫూర్తి ఎక్కడా కనిపించలేదు. ఇలాంటి అతి భారీ కార్యక్రమాన్నీ చూడలేదు. ఇది కేవలం కార్యక్రమం కాదు.. ఒక ఉద్యమం. గత 11 ఏళ్లలో నేను హాజరైన అన్ని యోగా కార్యక్రమాల్లోకీ యోగాంధ్ర అనుభవం ప్రత్యేకంగా నిలిచిపోతుంది.


దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు చంద్రబాబు, లోకేష్‌ చేసిన కృషి అభినందనీయం. నెల రోజుల పాటు యోగాంధ్ర నిర్వహించడం అసాధారణ విషయం. 30 రోజుల పాటు సమాజంలోని అన్ని వర్గాల వారినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చి ఎలా నిర్వహించారో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాను. ఆ నివేదిక వచ్చిన తర్వాత అధ్యాయనం కోసం అన్ని రాష్ట్రాలకూ పంపుతా. యోగాంధ్ర విజయాన్ని మీరందరూ కూడా స్టడీ చేయాలి’ అని కేంద్ర మంత్రులకు సూచించారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలో చంద్రబాబు, లోకేశ్‌ను చూసి మిగతా వారంతా నేర్చుకోవాలన్నారు.


నేటి నుంచే వృద్ధులు, దివ్యాంగులకు రేషన్‌

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): వృద్ధులు, వికలాంగులకు ముందస్తుగా రేషన్‌ ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో వారికి గురువారం నుంచి సరుకులు డోర్‌ డెలివరీ చేయనున్నారు. గత నెలలో రేషన్‌ షాపుల నుంచి సరుకుల పంపిణీని పునరుద్ధరించిన నేపథ్యంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలు సవరించింది. వారం రోజులు ముందుగానే వారికి రేషన్‌ సరుకులు డోర్‌ డెలివరీ ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించింది.

Updated Date - Jun 26 , 2025 | 03:23 AM