Pawan Kalyan: దేశ భద్రత.. ప్రతి పౌరుడి బాధ్యత: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Nov 12 , 2025 | 09:42 PM
ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశభద్రత కేవలం కేంద్ర ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని అన్నారు. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని, దేశంలోని ప్రతి వ్యవస్థ కంచుకోటగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. ఉగ్రకుట్రలో డాక్టర్ల వంటి వారు కూడా ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పోలీసులు 2900 కిలోల పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. భద్రతా దళాలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పోలీసులు, నిఘా సంస్థల సిబ్బందిపై ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఎలాంటి పొగడ్తలు ఆశించకుండా నిస్వార్థ సేవ చేస్తుంటారని కీర్తించారు (Pawan Kalyan On National Security).
ఎటువంటి గుర్తింపును కోరుకోకుండా పగలు, రాత్రి దేశానికి వారు సేవ చేస్తారని అన్నారు. నిశ్శబ్దంగా వారు చేసుకుపోయే పని వల్ల ఎందరి ప్రాణాలో నిలుస్తున్నాయని కితాబునిచ్చారు. 2,900 కేజీల పేలుడు పదార్థాలు పట్టుబడకపోయి ఉంటే ఏమై ఉండేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, నిఘా సంస్థలకు దేశ ప్రజలు సర్వత్రా రుణపడి ఉంటారని చెప్పారు. ఉగ్రవాదం దేశమంతటా వ్యాపిస్తోందని డిప్యూటీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరంలో జరిగిన అరెస్టులతో ఐఎస్ఐ భావజాల ప్రేరేపిత ఉగ్రకుట్ర వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఎన్‌ఐఏ, ఇతర సంస్థలు విజయవంతంగా ఈ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయని అన్నారు.
జాతీయ భద్రత అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాదని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. ఇది ఢిల్లీకే పరిమితమని అనుకోకూడదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మొదలు పంచాయతీల వరకూ అందరూ ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యవస్థ ఓ కంచుకోటగా మరాలని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ప్రాంతం, ప్రతి స్కూలు, ప్రతి పోలిస్ స్టేషన్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దేశం బయటి శత్రువుల నుంచి సాయుధ దళాలు కాపాడుతున్నాయని చెప్పిన పవన్.. దేశాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న అంతర్గత విచ్ఛిన్నకర శక్తుల నుంచి కాపాడేది ఎవరిని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో పౌరులు, ముఖ్యంగా యువత మౌన ప్రేక్షకులుగా ఉండిపోకూడదని హెచ్చరించారు. స్వల్ప విషయాలపై యువత శక్తియుక్తులు వృథా కాకూడదని అన్నారు. మతం, కులం, భాష, ప్రాంతీయ రాజకీయాల వివాదాలపై ప్రజల దృష్టి మళ్లిన సమయంలో భారత దేశ ఆత్మ, సంస్కృతిపై దాడికి బయటి శక్తులు నిరంతరం యత్నిస్తున్నాయని అన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. అంతిమంగా ప్రతి పౌరుడూ దేశ రక్షణకు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. అంతా భారతీయులం అన్న విషయం, దేశ భద్రతకే తొలి ప్రాధాన్యం అన్న విషయాలు మర్చిపోకూడదని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో పోలీసులు ముమ్మర తనిఖీలు
నన్ను క్షమించండి.. ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం..
For More AP News And Latest News