Share News

DDO Offices: నవంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డి.డి.ఓ. కార్యాలయాలు ప్రారంభించండి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ABN , Publish Date - Oct 23 , 2025 | 03:02 PM

ఏపీలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని.. ఇందుకోసం నవంబర్ 1వ తేదీ నుంచి డి.డి.ఓ..

DDO Offices: నవంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డి.డి.ఓ. కార్యాలయాలు ప్రారంభించండి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
Pawan Kalyan DDO offices

అమరావతి, అక్టోబర్ 23: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని ఉప ముఖమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని అన్నారు. ఇందుకోసం నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల (డి.డి.ఓ.) కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు.


ఈరోజు (గురువారం) మధ్యాహ్నం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. క్లస్టర్ విధానం రద్దు చేసి, 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకువచ్చామని చెప్పారు. పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు, గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని పవన్ తెలిపారు.


15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు, పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. నిధులు సమకూర్చడంలోను, పాలనాపరమైన సంస్కరణల్లోనూ కూటమి ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ఆ ఫలితాలు ప్రజలకు చేర్చి, పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశీలక బాధ్యత తీసుకోవాలన్నారు.

నిధుల వినియోగం, పాలన సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు చేపట్టాలని డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. పల్లె పండగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

చీకటి నింపిన దీపావళి.. 125 మంది కళ్ళకు గాయాలు.. ఏమైందంటే?

మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనా?

Updated Date - Oct 23 , 2025 | 03:58 PM