Endowments Department : ఆలయ పాలకవర్గాల నియామకంపై కసరత్తు
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:57 AM
రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు పాలకమండళ్ల నియామకంపై టీడీపీ కసరత్తు చేపట్టింది.

టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో పల్లా టెలీ కాన్ఫరెన్స్
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు పాలకమండళ్ల నియామకంపై టీడీపీ కసరత్తు చేపట్టింది. అర్హతలకు అనుగుణంగా ఈ మండళ్లలో ధర్మకర్తల నియామకానికి ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం సాయంత్రం ఈమేరకు ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కలిపి సుమారు 500 ఆలయాలకు పాలక మండళ్లను నియమించాల్సి ఉంది. వీటి భర్తీకి దేవదాయ శాఖ కొన్ని అర్హతలు నిర్దేశించింది. టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ అర్హతలను అన్నింటిని పల్లా శ్రీనివాసరావు చదివి వినిపించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఒకటి రెండు రోజుల్లో తమ ప్రతిపాదనలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆయన వారిని కోరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల పాలక వర్గాలకు ఇంకా కొన్ని నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు అందకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ నియోజకవర్గాల జాబితాను ఆయన చదివి వినిపించారు. ఇవి సుమారుగా 50 వరకూ ఉన్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థలకు పాలక వర్గాల నియామకంపై కూడా ఇన్‌చార్జి మంత్రులతో ఎమ్మెల్యేలు చర్చించాలని, ఆలస్యం చేయవద్దని ఆయన వారికి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..
Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..
Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట