Devotees : శ్రీశైల మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:57 AM
శ్రీశైల మల్లన్నకు మహాశివరాత్రి నాడు ధరింపజేసే తలపాగాను తయారు చేసే మహదావకాశం బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురి పంచాయతీకి చెందిన పృథివి సుబ్బారావుకు దక్కింది.

అనాదిగా వస్తున్న ఆచారం
ఈ దఫా పృథివి సుబ్బారావు దంపతులకు దక్కిన అవకాశం
చీరాల, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మల్లన్నకు మహాశివరాత్రి నాడు ధరింపజేసే తలపాగాను తయారు చేసే మహదావకాశం బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురి పంచాయతీకి చెందిన పృథివి సుబ్బారావుకు దక్కింది. దశాబ్దాలుగా సుబ్బారావు పూర్వీకులే మల్లన్న తలపాగాను మగ్గంపై స్వయంగా తయారు చేసి స్వామి తలకు చుట్టే ఆనవాయితీ. ఇటీవల సుబ్బారావు తండ్రి వెంకటేశ్వర్లు అనారోగ్యంబారిన పడడంతో ఈ ఏడాది ఆ అవకాశం సుబ్బారావుకు దక్కింది. 3 నెలలు శ్రమించి 360 మూరల పొడవున్న తలపాగాను తయారు చేశారు. దాన్ని ఆదివారం సుబ్బారావు, దుర్గ దంపతులు శ్రీశైలంలోని స్వామి సన్నిధికి తీసుకెళ్లారు. పండుగ రోజు ఆలయంలో అన్ని ప్రధాన దీపాలు ఆర్పివేశాక పాగాను స్వామివారికి సుబ్బారావు చుట్టనున్నారు. శ్రీశైల మల్లన్న తలపాగాను దర్శించుకోవడం వల్ల సర్వలోపాలు, పాపాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం.