Share News

UPSC 2024 Results: సివిల్స్‌లో తెలుగు తేజాలు

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:25 AM

సివిల్స్‌ 2024లో తెలుగువారు మరోసారి సత్తా చాటుతూ 57మంది ర్యాంకులు సాధించారు. టాప్‌-100లో ఏడుగురు చోటు దక్కించగా, శ్రీకాకుళం జిల్లా బాన్న వెంకటేశ్‌ 15వ ర్యాంకుతో రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చారు.

UPSC 2024 Results: సివిల్స్‌లో తెలుగు తేజాలు

టాప్‌ 100 జాబితాలో ఏడుగురు మనోళ్లు.. 57 మంది క్వాలిఫై!

11వ ర్యాంకు సాధించిన ఓరుగల్లు బిడ్డ సాయి శివాని

శ్రీకాకుళం జిల్లావాసి బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు

తుది ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

1,129 పోస్టులకుగాను 1,009 మంది ఎంపిక

725 మంది పురుషులు.. 284 మంది మహిళలు

తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా యూపీ యువతి శక్తి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఎప్పటిలాగానే సివిల్స్‌ పరీక్షల్లో తెలుగువారు మరోసారి సత్తా చాటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 57 మంది అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. టాప్‌-100 జాబితాలో ఏడుగురు తెలుగువారు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాన్న వెంకటేశ్‌ 15వ ర్యాంకుతో టాప్‌-20లో నిలిచారు. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన చక్కా స్నేహిత్‌ (94), కడప జిల్లా అలంఖాన్‌పల్లెకు చెన్నంరెడ్డి శివగణేశ్‌ రెడ్డి (119), పల్నాడు జిల్లా రుద్రవరానికి చెందిన చల్లా పవన్‌ కల్యాణ్‌ (146), కడప జిల్లా చెన్నూరు చెందిన నెలటూరు శ్రీకాంత్‌ రెడ్డి (151) మంచి ర్యాంకులతో సత్తా చాటారు. ఇక తెలంగాణలో ఓరుగల్లు బిడ్డ ఇట్టబోయిన సాయిశివాని 11వ ర్యాంకుతో అదరగొట్టగా.. అభిషేక్‌ శర్మ (38), రావుల జయసింహారెడ్డి (46), చింతకింది శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి (62), సాయి చైతన్య జాదవ్‌ (68), ఎన్‌.చేతనరెడ్డి (110), నెల్లూరు సాయితేజ (154), కొలిపాక శ్రీకృష్ణసాయి (190) తదితరులు తుది జాబితాలో చోటు సాధించారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం నిర్వహించిన ‘సివిల్స్‌ 2024’ తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌కు చెందిన శక్తి దూబె తన తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలవగా.. హరియాణాలో జన్మించి గుజరాత్‌లో పెరిగిన హర్షిత గోయల్‌ రెండోస్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో వరుసగా అర్చిత్‌ పరాగ్‌ (3), షా మార్గి చిరాగ్‌ (4), ఆకాశ్‌ గార్గ్‌ (5) నిలిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 42,560 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కాగా.. వారిలో 600 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వారిలో దాదాపు 100మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. 40 మందికిపైగా తుది జాబితాలో చోటు సాధించారు.


1,129 పోస్టుల భర్తీకి..: కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1,129 పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. జూన్‌ 16న ప్రిలిమినరీ, సెప్టెంబర్‌ 20 నుంచి 29 వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించింది. జనవరి 7 నుంచి ఏప్రిల్‌ 17 వరకూ దశల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. ప్రిలిమినరీ పరీక్షకు 9,92,599 మంది దరఖాస్తు చేసుకోగా, 5,83,213 మంది మాత్రమే పరీక్ష రాశారు. వీరిలో మెయిన్స్‌ రాత పరీక్షకు 14,627 మంది అర్హత సాధించగా, ఇంటర్వ్యూలకు 2,845మంది ఎంపికయ్యారు. జనవరి 7 నుంచి ఏప్రిల్‌ 17 నడుమ ఇంటర్వ్యూలు నిర్వహించి.. వారిలో1,009 మంది అభ్యర్థులను సివిల్స్‌కు ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. వారిలో జనరల్‌ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ కింద 109, ఓబీసీ కేటగిరీ కింద 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87 మంది ఎంపికైనట్టు వివరించింది. అభ్యర్థులకు ఏమైనా సమాచారం కావాలనుకుంటే పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య స్వయంగా సంప్రదించవచ్చని.. లేదా 23385271, 23381125, 23098543 నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించింది. సివిల్స్‌ అభ్యర్థుల మార్కుల జాబితాను పదిహేను రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు యూపీఎస్సీ వెల్లడించింది.


తెలుగు రాష్ట్రాల నుంచి మరికొందరు ర్యాంకర్లు..

సివిల్స్‌ ఫలితాల్లో 200కు పైగా ర్యాంకు సాధించిన తెలుగువారిలో.. బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి (221), పూల ధనుష్‌ (232), పోతరాజు హరిప్రసాద్‌ (255), పి.లక్ష్మీప్రియ (297), ఎస్‌.సాయికిరణ్‌ (298), కె.శ్రీనివాస కీర్తిరెడ్డి (316), ఎం.ఉదయ్‌ కృష్ణారెడ్డి (350), ఎం.పవన్‌కుమార్‌ రెడ్డి (375), రాపర్తి ప్రీతి (451), పి.భార్గవ్‌ (455), సి.రాహుల్‌ (462), జె.భానుప్రకాశ్‌ (523), సి.భరత్‌ (567), గుబ్బల ఏఆర్‌వీ సూర్యతేజ (647), దోనేపూడి విజయ్‌బాబు (681), ఎం.వెంకటేశ్‌ ప్రసాద్‌ సాగర్‌ (700), పి.ఇంద్రార్చిత (739) శనగవరపు సాయిభార్గవ (798), టి.సూర్యతేజ (799), వావిలపల్లి భార్గవ (830), గుగులోతు జీతేందర్‌ నాయక్‌ (855), బి.మౌర్యతేజ (856) బి.వెంకట రామ్‌యజ్ఞ (863), వడ్డాది సాయిరోహన్‌ (892), కోకా ప్రియతం మనోహర్‌ (915), జి.ఆంజనేయులు (934), బానోతు శ్రీనికేశ్‌నాయక్‌ (938), జి.ప్రసాద్‌ (944), ఆర్‌.సుధాకర్‌ (949), చలవాది శ్రావణ సౌమ్య (951), ఆర్‌.సాయిమోహిని మానస (975) తదితరులున్నారు.

ఇదీ లెక్క

యూపీఎస్సీ ఈ పరీక్షలను 1129 పోస్టుల భర్తీకి నిర్వహించింది. అందులో ఏయే ఉద్యోగాల సంఖ్య ఎంతంటే..

ఐఏఎస్‌ - 180

ఐఎ్‌ఫఎస్‌ - 55

ఐపీఎస్‌ - 147

గ్రూప్‌ ఏ - 605

గ్రూప్‌ బి - 142


Also Read:

పాపం.. చచ్చిపోతాడని తెలీదు..

కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..

చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 23 , 2025 | 04:25 AM