Share News

CM Chandrababu Naidu: సైనికుల పోరాటానికి సెల్యూట్‌

ABN , Publish Date - May 17 , 2025 | 03:27 AM

విజయవాడలో త్రివర్ణ ర్యాలీ నిర్వహించిన సీఎం చంద్రబాబు, ఉగ్రవాదంపై భారత్‌ త్రివిధ దళాల ధైర్యాన్ని ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ద్వారా ప్రదర్శించామని అన్నారు. మురళీ నాయక్‌ వీరమరణం దేశ యువతకు స్ఫూర్తిగా నిలవాలని, దేశ భద్రతకు ప్రజల మద్దతు అవసరమని పిలుపునిచ్చారు.

CM Chandrababu Naidu: సైనికుల పోరాటానికి సెల్యూట్‌

సెలబ్రిటీల నుంచి దేశభక్తి ఆశించకండి.. దేశభక్తికి మురళీనాయక్‌ లాంటి వారిని చూపండి: డిప్యూటీ సీఎం పవన్‌.. విజయవాడలో ఘనంగా తిరంగా ర్యాలీ

సైనికుల పోరాటానికి సెల్యూట్‌

దేశాభివృద్ధిని ఉగ్రవాదం అడ్డుకోలేదు: చంద్రబాబు

సూడో సెక్యులరిస్టులకు బుద్ధి చెప్పాలి: పవన్‌

సైనికులకు సంఘీభావంగా యాత్రలు: పురందేశ్వరి

విజయవాడలో ఘనంగా తిరంగా ర్యాలీ

అమరావతి/ విజయవాడ, మే 16 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ప్రపంచానికి మన త్రివిధ దళాల సత్తా చాటాం. ఉగ్రవాదం పేరుతో దేశాభివృద్ధిని అడ్డుకునే కుట్రలు, కుతంత్రాలు దేశాన్ని ఏమీ చేయలేవు. ఉగ్రవాదం పేరుతో దేశంలోకి ఎవరు వచ్చినా వారికి అదే చివరి రోజు అవుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన నేపథ్యంలో విజయవాడలో శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో చంద్రబాబు మాట్లాడుతూ.. భారతదేశం సైనిక శక్తిలోనే కాదు ఆర్థిక శక్తిలోనూ దూసుకుపోతోందని, 2047 నాటికి ప్రపంచంలో నంబర్‌ వన్‌ లేదా నంబర్‌ టు స్థానంలో నిలవడం ఖాయమన్నారు. పహల్గాం లాంటి సంఘటనలు పునరావృతం అయితే ఆపరేషన్‌ సిందూర్‌ లాంటివి పునరావృతం అవుతాయన్నారు. ఉగ్రవాదంపై మన రక్షణ దళాలు చేస్తున్న పోరాటానికి సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. ప్రపంచం గర్వించదగ్గ త్రివిధ దళాలు మన సొంతమని చెప్పుకోవడానికి గర్విస్తున్నానన్నారు. ‘పహల్గాం వంటి ఘటనలు చూస్తే రక్తం ఉడికిపోతుంది. రోషం వస్తుంది. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని చంపేసిన ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలా వద్దా.. వారిని ప్రోత్సహిస్తున్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. మన ఆడబిడ్డల నుదుట తిలకాన్ని చెరిపేసిన ఉగ్రవాదులు ఈ భూమి మీద ఉండటానికి అనర్హులని భావించిన ప్రధాని మోదీ ఆపరేషన్‌ సిందూర్‌కు శ్రీకారం చుట్టారన్నారు.

fd.jpg

ఉగ్రవాదులు మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా చేయాలనే సంకల్పంతో త్రివిధ దళాలు వారిపై పోరాటం చేశాయన్నారు. ‘ఈ పోరాటంలో మురళీ నాయక్‌ లాంటి వారు వీరమరణం పొందారు. 25 ఏళ్ల వయసున్న మురళీ నాయక్‌ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. అలాంటి వారిని మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో దేశ భక్తిపై చర్చ జరగాలి. యువతకు మురళీ నాయక్‌ లాంటి వారు స్ఫూర్తి కావాలి. త్రివిధ దళాల పోరాట స్ఫూర్తిని కీర్తిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో తిరంగా ర్యాలీల పేరుతో ఓ పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు నిమిత్తమాత్రులం. ఇది ప్రజా ఉద్యమం. మువ్వన్నెల జెండాను రూపొందించినది తెలుగువ్యక్తి పింగళి వెంకయ్య కావడం మనందరికీ గర్వకారణం’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.


మోదీ సమర్థ నాయకుడు

‘ఉగ్రవాదంపై పోరాడే ఏకైక దేశం భారతదేశం. ఉగ్రవాదంపై పోరాటం చేసే ఏకైక నాయకుడు మోదీ. భారతదేశం ఎవరి జోలికీ వెళ్లదు. మన జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని ఆపరేషన్‌ సిందూర్‌తో రుజువు చేశాం. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ప్రధాని మోదీ. సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే సరైన నాయకుడూ మోదీయే’ అని చంద్రబాబు ప్రశంసించారు.

చనిపోతే మురళీనాయక్‌లా చనిపోవాలి: పవన్‌

చనిపోతే జవాన్‌ మురళీనాయక్‌లా చనిపోవాలని, దేశం కోసం వీరమరణం పొందిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తిరంగా ర్యాలీలో పవన్‌ మాట్లాడారు. ‘1947లో దేశ విభజన జరిగినప్పటి నుంచి మనం ఎప్పుడూ ప్రశాంతత చూడలేదు. విభజన జరిగిన రోజు లక్షలాది మందిని చంపేశారు. ఈ రోజు అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం ముందుకెళుతుంటే పాకిస్థాన్‌ వారు మన అభివృద్ధిని నిరోధించేందుకు ఉగ్రవాదాన్ని మనపైకి ఉసిగొల్పుతున్నారు. కోయంబత్తూర్‌ బాంబుపేలుళ్లు, గోకుల్‌చాట్‌ పేలుళ్లు, లుంబినీ పార్కు పేలుళ్లు, ముంబైలో తాజ్‌ హోటల్‌పై ఉగ్రదాడి.. ఇలా ఏది చూసినా దాని వెనుక పాకిస్థాన్‌ ఉంటోంది. మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అది సరిహద్దుల్లోని సైనికుల చలవే. సూడో సెక్యులరిస్టులు కొందరు సెక్యులరిస్టుల ముసుగులో మన త్రివిధ దళాల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పడమే మన సైనికులకు మనమిచ్చే మద్దతు. సినిమా హీరోలు దేశాన్ని నడిపేవారు కాదు.. వారు ఎంటర్‌టైన్‌ చేసేవారు మాత్రమే. సెలబ్రిటీల నుంచి దేశభక్తిని ఆశించకుండా, దేశభక్తి కోసం మురళీ నాయక్‌ వంటి వారిని ఉదాహరణగా చూపండి. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పిన ప్రధాని మోదీ లాంటి వారికి మద్దతు ఇద్దాం. సహనానికి హద్దు ఉంటుంది. పాకిస్థాన్‌కు ఒక్కటే చెప్పాలి.. మీరు మా దేశం మీదకు వస్తే మేం మీ ఇళ్లలోకి వచ్చి కొడతాం అని బలంగా చెప్పాలి’ అని పవన్‌ అన్నారు.


మోదీ సందేశాలను గమనించాలి: పురందేశ్వరి

2014 నుంచి సమర్థ, దృఢమైన నాయకత్వం వచ్చాక దేశ భద్రతతో చెలగాటం ఆడేవారికి దీటైన జవాబు ఇస్తున్నారని పురందేశ్వరి అన్నారు. ‘మన ప్రతిస్పందన ఎలా ఉంటుందో తాజాగా పాకిస్థాన్‌పై జరిపిన దాడులను అందరూ చూశారు. సైనికులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు చేపట్టారు. మురళీనాయక్‌ ప్రాణత్యాగంతో అందరూ అండగా నిలబడాలని పెద్ద సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలిపారు. ఉగ్రవాదం, చర్చలు సమాంతరంగా సాగవని.. ఉగ్రవాదం, వ్యాపారం సమాంతరంగా నడవకూడదని.. నీరు, రక్తం సమాంతరంగా పారలేవన్న మోదీ సందేశాన్ని అందరూ గమనించాలి’ అని అన్నారు.

బెజవాడలో త్రివర్ణ శోభ

బెజవాడలో జరిగిన భారత శౌర్య తిరంగా ర్యాలీ దేశభక్తిని రగిలించింది. జనం భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి వచ్చారు. బందరు రోడ్డు త్రివర్ణంతో ధ గధగలాడిపోయింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి త్రివర్ణ పతాకాలు చేతబూని నడిచారు. చంద్రబాబు, పవన్‌ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ హుషారు నింపారు. ఇందిరా గాంధీ మునిసిపల్‌ స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు 2 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. భారత్‌ మాతాకీ జై, వందేమాతరం అంటూ జనం నినాదాలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ కూడా భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:27 AM