Handloom Officer : నాపైనే కంప్లైరట్ చేస్తారా?!
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:11 AM
రెక్కాడితేగానీ డొక్కాడని చేనేత కార్మికులు.. అప్పు చేసి ముడిసరుకు తెచ్చుకుని వస్త్రం నేసి సొసైటీలకు ఇస్తే.. ప్రభుత్వ అవసరాలకు అధికారులు కొనుగోలు చేయడంలేదు.

ఒక్క మీటరు కూడా కొనను.. పోండి!
నేతన్నలపై మండిపడ్డ అధికారి..
పొరుగు రాష్ట్రంలో కొనుగోళ్ల గుట్టు రట్టు
అక్రమాలు మెడకు చుట్టుకోవడంతో ఆగ్రహం
అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ‘నాపైనే సీఎ్‌సకు కంప్లైంట్ చేస్తారా.. మీ సొసైటీల నుంచి ఒక్క మీటరు కూడా ప్రొక్యూర్ చెయ్యను.. పోండి ఇక్కడి నుంచి..’ అంటూ చేనేత సొసైటీల ప్రతినిధులపై మండిపడ్డ అధికారి తీరు నేతన్నల్లో ఆవేదన నింపింది. రెక్కాడితేగానీ డొక్కాడని చేనేత కార్మికులు.. అప్పు చేసి ముడిసరుకు తెచ్చుకుని వస్త్రం నేసి సొసైటీలకు ఇస్తే.. ప్రభుత్వ అవసరాలకు అధికారులు కొనుగోలు చేయడంలేదు. ప్రభుత్వ జీవోలను సైతం లెక్క చేయకుండా.. పొరుగు రాష్ట్రం తెలంగాణలోని మ్యాక్ సొసైటీల నుంచి కార్పెట్లు, వులెన్ బెడ్ షీట్లు, టవళ్ల కొనుగోలుకు ఏపీ అధికారులు ఆర్డరిచ్చారు. ఏకంగా 11 కోట్ల రూపాయల సరుకు కోసం 50 శాతం అడ్వాన్సు ముందుగా చెల్లించారు. మన రాష్ట్రంలోని ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఇదే తరహా వస్త్రం అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ ఆర్డర్ ఇవ్వలేదు. ఎంత బతిమాలినా అధికారులు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వక పోవడంతో నేతన్నలు రాష్ట్ర ప్రభుత్వం(సీఎ్‌స)తోపాటు విజిలెన్స్‌కు, మంత్రి నారా లోకేశ్‌కు లిఖితపూర్వకంగా సమస్యను విన్నవించుకున్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఆరా తీయడంతో తెలంగాణలో టెస్కో నుంచి చున్నీలు మాత్రమే కొనుగోలు చేసిన మన జౌళిశాఖ అధికారులు, అక్కడి మ్యాక్ సొసైటీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా కార్పెట్లు, బెడ్ షీట్లు, టవళ్లు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్లు తేలింది. లోతుగా కూపీ లాగడంతో వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని మ్యాక్ సొసైటీలకు కోట్లాది రూపాయల వస్త్రాలు సరఫరా చేసే సామర్థ్యం లేదని, లక్షలాది దుప్పట్లు, కార్పెట్లు, టవళ్ల తయారీ కోసం నూలు ఎక్కడ కొనుగోలు చేశారో కూడా చెప్పలేక పోయినట్లు తేలింది.
మన రాష్ట్రంలోని అధికారులు కమీషన్ల కోసమే రిటైర్డ్ అయిన ఇద్దరు ఆప్కో మాజీ ఉద్యోగులను దళారీలుగా ఏర్పాటు చేసుకుని ఇక్కడి టెక్నికల్ అధికారి ఎలాంటి కాస్టింగ్ షీట్(ముడిసరుకు, కూలీ ఇతర వివరాలు) చూడకుండా అంతా మేనేజ్ చేసినట్లు ఆధారాలు లభించాయి. దీంతో బాధ్యులైన అధికారుల మెడకు ప్రభుత్వం ఉచ్చు బిగించబోతోంది. ఈ విషయం తెలిసిన చేనేత జౌళిశాఖ అధికారులు తమపై ఫిర్యాదు చేసిన నేతన్నలపై ఆగ్రహంతోపాటు ద్వేషం పెంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏరి కోరి తెచ్చుకున్న ఒక అధికారి వద్దకు తాజాగా చేనేత సొసైటీల ప్రతినిధులు వెళ్లి తమ వస్త్రం కొనుగోల చేయాలని వేడుకున్నారు. వెంటనే వారిపై రంకెలేసిన అధికారి ‘నా పైనే ఫిర్యాదు చేస్తారా? మీ సొసైటీల నుంచి ఒక్క మీటర్ కూడా కొనే ప్రసక్తే లేద’ంటూ మండిపడ్డారు. తాము గోడు వెళ్లబోసుకున్నాం తప్ప ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని వివరించినా.. ‘మీరు సంతకాలు పెట్టి సీఎ్‌సకు లేఖ ఇచ్చారుగా.. నాకు కూడా ప్రభుత్వంలో పెద్దల సపోర్ట్ ఉంది.. ఏమవుతుంది మీరు కంప్లెయింట్ ఇస్తే..’ అంటూ బెదిరించడంతో దిక్కుతోచని నేతన్నలు ఊసూరుమంటూ వెళ్లిపోయారు. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి గోడు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. చేనేత వర్గాలకు అండగా ఉండే టీడీపీ ప్రభుత్వంలోనూ తమకు న్యాయం జరగకపోతే.. ఆత్మహత్యలే శరణ్యమంటూ కన్నీరు పెట్టుకొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..