Share News

Andhra Pradesh: కప్పం కట్టాల్సిందే!

ABN , Publish Date - Mar 10 , 2025 | 03:06 AM

గత ప్రభుత్వ నిర్వాకంతో కుదేలైన రాష్ట్రాన్ని భారీ పెట్టుబడులతో తిరిగి గాడిలో పెట్టేందుకు అహరహం పాటుపడుతోంది. కానీ ప్రభుత్వ సంకల్పాన్ని భగ్నం చేసే చర్యలకు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే పాల్పడితే ఏమనాలి? ఏకంగా కప్పం కడితేనే కుదురుతుందంటూ నిర్మాణ పనులకు అడ్డం పడితే దానిని బరితెగింపు కాక మరేమనాలి? రామాయపట్నంలో ప్రస్తుతం జరుగుతున్న దందా ఇదే!

Andhra Pradesh: కప్పం కట్టాల్సిందే!

పనుల్లో ‘వాటా’ కావాలి.. కాదంటే ఒక్క లారీనీ రానిచ్చేది లేదు

అధికార పార్టీ ఎమ్మెల్యే అడ్డగోలుతనం!

రాష్ట్రానికి కొత్త పెట్టుబడిదారులను తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గత ప్రభుత్వ నిర్వాకంతో కుదేలైన రాష్ట్రాన్ని భారీ పెట్టుబడులతో తిరిగి గాడిలో పెట్టేందుకు అహరహం పాటుపడుతోంది. కానీ ప్రభుత్వ సంకల్పాన్ని భగ్నం చేసే చర్యలకు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే పాల్పడితే ఏమనాలి? ఏకంగా కప్పం కడితేనే కుదురుతుందంటూ నిర్మాణ పనులకు అడ్డం పడితే దానిని బరితెగింపు కాక మరేమనాలి? రామాయపట్నంలో ప్రస్తుతం జరుగుతున్న దందా ఇదే!

రామాయపట్నం నిర్మాణ సంస్థకు

ఎమ్మెల్యే ఇంటూరి హుకుం

సంస్థ ససేమిరా అనడంతో విశ్వరూపం

పోర్టు పనుల కోసం కంకర, ఇసుక

తీసుకెళ్తున్న లారీల అడ్డగింత

తప్పుడు కేసులు పెట్టించి వేధింపులు

ట్రిప్పునకు వెయ్యి ఇవ్వాలనీ డిమాండ్‌

సీఎంవోకు చేరిన ఎమ్మెల్యే వ్యవహారం

ఆదేశాలిచ్చాకా ఆగని ఎమ్మెల్యే దందా!

(ఒంగోలు - ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా నడిచిన దందా.. ఇప్పుడు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లోనూ అదే తరహా దందాకు తెర లేచింది. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు(టీడీపీ) స్వయంగా ఈ దందాకు తెర తీసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలేం జరిగిందంటే.. పోర్టు నిర్మాణ పనుల్లో తనకు వాటా ఇవ్వాలని ఇంటూరి తొలుత డిమాండ్‌ చేశారు. కానీ ఆయన డిమాండ్‌ చేసిన రీతిలో వాటా ఇచ్చేందుకు, ఇతరత్రా కప్పం కట్టేందుకు కాంట్రాక్టు సంస్థ ససేమిరా అంది. దీంతో ఇంటూరి తన ప్రతాపం చూపడం మొదలెట్టారు. భయపెట్టి అయినా సరే కాంట్రాక్టు సంస్థను దారికి తెచ్చుకునే లక్ష్యంతో ఏకంగా ‘దారి’ కాశారు. నిర్మాణ పనుల కోసం కంకర, ఇసుక తెస్తున్న లారీలకు అడ్డం పడ్డారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ వెళ్లకుండా చేయడం ద్వారా నిర్మాణ సంస్థను తన దారికి తెచ్చుకోవాలన్నది ఆయన లక్ష్యం. ఎలాగైనా తనకు కప్పం కట్టేలా ఒప్పించడమే ఆయన చర్యల అసలు ఉద్దేశం.


కాదంటే బండికి వెయ్యి...

నిర్మాణ పనుల్లో వాటా డిమాండ్‌తో మొదలైన ఇంటూరి అరాచకం.. ఆ తర్వాత కంకర, ఇసుక తోలకం పనులను పూర్తిగా తనకే అప్పగించాలనే దాకా వెళ్లినట్లు తెలుస్తోంది. కాదంటే ఒక్కో లారీ ట్రిప్పునకు వెయ్యి రూపాయల చొప్పున తనకు చెల్లించాలని బెదిరించినట్లు సమాచారం. అందుకు నిర్మాణ సంస్థ అంగీకరించకపోవడంతో.. ఇద్దరు కానిస్టేబుళ్లను దగ్గర పెట్టుకుని మరీ లారీలను రోడ్డు మీద నిలిపివేయిస్తూ, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. పోర్టు పనులు ముందుకు సాగకుండా నానా అరాచకం సృష్టిస్తున్నారు.

సీఎంవోకు చేరినా..

ఇంటూరి అరాచకం గురించి పలువురు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన సీఎంవో అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు, జిల్లా పోలీసు అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. పోర్టు పనులకు ఎలాంటి ఆటంకాలు రాకూడదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. అయినా ఎమ్మెల్యే తన దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్న తీరు అధికార పార్టీ వర్గాల్లోనూ, నియోజకవర్గ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై వివరణ కోరేందుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.

ఆదిలోనే ఆటంకాలు!

రామాయపట్నం పోర్టుకు 2018 ప్రాంతంలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అక్కడికి సమీపంలోనే పేపరు మిల్లు నిర్మాణానికి అదే సమయంలో శ్రీకారం చుట్టారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం పేపరు మిల్లుకు తిలోదకాలు ఇచ్చి పోర్టు నిర్మాణ పనులను మాత్రమే చేపట్టింది. కొంతమేర పనులు జరిగాయి. ఆ తర్వాత ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఈనెల మొదటి వారంలో నిర్మాణ సంస్థ పోర్టు పనులు పునఃప్రారంభించింది. సముద్రంలో అసంపూర్తిగా ఉన్న బ్రేక్‌వాటర్‌ పనులు పూర్తిచేయడంపై దృష్టి సారించింది. ఇక్కడ పనులు ప్రారంభంకాగానే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రంగంలోకి దిగారు!


Read more :

Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?

Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 03:07 AM