Share News

NTR Vaidya Seva: ఎన్టీఆర్‌ వైద్య ట్రస్ట్‌.. అస్తవ్యస్తం!

ABN , Publish Date - Mar 10 , 2025 | 02:52 AM

వైద్యంపై అవగాహన లేని అధికారులను నియమించడం, అర్హత లేని అధికారులను కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టడంతో ట్రస్ట్‌ ప్రధాన లక్ష్యం దారి తప్పుతోంది. ముఖ్యంగా ట్రస్ట్‌లో విభాగాధిపతులు అందినకాడికి దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇతర శాఖలకు చెందిన కొంతమంది అధికారులు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో వాలిపోయారు.

 NTR Vaidya Seva: ఎన్టీఆర్‌ వైద్య ట్రస్ట్‌.. అస్తవ్యస్తం!

సేవ కంటే రాజకీయాలకే అడ్డా.. గాడి తప్పిన పాలన.. లక్ష్యం పక్కదారి

కీలక పోస్టుల్లో అర్హత లేని అధికారులు.. ఇతర శాఖల వారికి బాధ్యతలు

అందినకాడికి దోచేయడమే పని.. ఆస్పత్రులపై కక్షసాధింపు చర్యలు

మంత్రి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ రాజకీయాలకు అడ్డాగా మారింది. వైద్యంపై అవగాహన లేని అధికారులను నియమించడం, అర్హత లేని అధికారులను కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టడంతో ట్రస్ట్‌ ప్రధాన లక్ష్యం దారి తప్పుతోంది. ముఖ్యంగా ట్రస్ట్‌లో విభాగాధిపతులు అందినకాడికి దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇతర శాఖలకు చెందిన కొంతమంది అధికారులు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో వాలిపోయారు. వీరి రాకతో ట్రస్ట్‌ పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. అధికారులే ఒకరిపై మరొకరు అంతర్గతంగా ఫిర్యాదులు చేసుకోవడం... ట్రస్ట్‌లో వర్గాల వారీగా చీలిపోవడం... ఈవోలు, జేఈవోల పోస్టుల విషయంలో ఒక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం... వీరికి నచ్చని అధికారులపై బయట వ్యక్తులతో వీళ్లే ఫిర్యాదులు చేయించడం... వాటిని తీసుకువెళ్లి ట్రస్ట్‌ సీఈవో ముందు పెట్టడం... ఇలా ట్రస్ట్‌ను రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చేశారు. బయట నుంచి వచ్చిన అధికారుల వ్యవహర శైలి ట్రస్ట్‌ సీఈవోకు పెద్ద తలనొప్పిగా మారింది. ట్రస్ట్‌ అధికారులంతా కలిసి వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు.


సర్కారు లక్ష్యానికి భిన్నంగా...

ప్రభుత్వం ఇన్సూరెన్స్‌, ట్రస్ట్‌ ద్వారా పేద ప్రజల కు రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యం తో పని చేస్తోంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే.. ట్రస్ట్‌ అధికారులు మాత్రం అంతర్గత వివాదాలతో ట్రస్ట్‌ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు. కొత్తగా వచ్చిన ట్రస్ట్‌ సీఈవో కూడా పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదు. కొత్తగా ట్రస్ట్‌లోకి వచ్చిన అవగాహన లేని అధికారులపై ఆధారపడుతున్నారు. దీంతో ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో పాలన గాడి తప్పుతోంది. ట్రస్ట్‌లో ఎంప్యానల్‌మెంట్‌ అనేది కీలకం. ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలకు దీని ద్వారానే అనుమతులు ఇస్తారు. ఈ విభాగంలో కూడా అవినీతి ఎక్కువగా ఉంటోంది. మొన్నటి వరకూ ఎంప్యానల్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరించి న అధికారిపై ఆరోపణలు వచ్చాయి. సదరు అధికారిపై ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడైనా సమర్థుడైన అధికారికి ఎంప్యానల్‌మెంట్‌ బాధ్యతలు అప్పగించారా.. అంటే అదీ లేదు.

ఒకే అధికారికి 3 విభాగాలు.. డీఎంఈ కార్యాలయంలో క్యాన్సర్‌ కేర్‌ యూనిట్లు పర్యవేక్షించే అధికారిని తీసుకువచ్చి ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఎంప్యానల్‌మెంట్‌ ఈవో(ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌) బాధ్యతలతో పాటు ఈవో ఆపరేషన్స్‌, ఈవో ఈహెచ్‌ఎస్‌, చీఫ్‌ మెడికల్‌ ఆడిట్‌ విభాగాలు మొత్తం ఆయన చేతుల్లో పెట్టారు. ఎంప్యానల్‌మెంట్‌ విభాగంలోనే పని భారం ఎక్కువగా ఉంటుంది. ఈవో ఆపరేషన్స్‌ అంటే.. ప్రీ-ఆర్థలకు అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత ఈ విభాగానిదే. ఈహెచ్‌ఎస్‌ కూడా ట్రస్ట్‌లో కీలకం. ఈ మూడు విభాగాలను ఒకే అధికారి చేతుల్లో పెట్టారు. డీఎంఈ కార్యాలయంలో క్యాన్సర్‌ కేర్‌ యూనిట్ల పర్యవేక్షణలో సదరు అధికారులు అంత యాక్టివ్‌గా ఉండే వారు కాదు. అలాం టి వ్యక్తికి ట్రస్ట్‌లోని కీలకమైన విభాగాలు మొత్తం అప్పగించేశారు. ట్రస్ట్‌ అధికారులు ఏ ఉద్దేశంతో బాధ్యతలు మొత్తం ఆయనకు అప్పగించారో? తాము చేసే అవినీతిని ప్రశ్నించకూడదు.. చెప్పినట్లు చేసేవారు కావాలన్న ఉద్దేశంతో సదరు అధికారిని ట్రస్ట్‌కు తెచ్చారన్న విమర్శలున్నాయి.


పర్యవేక్షణ ఏదీ?

ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌పై ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ట్రస్ట్‌ నిర్వహణపై అధికారులు కనీసం దృష్టి పెట్టడం లేదు. దీంతో ట్రస్ట్‌లో కొంతమంది అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. ట్రస్ట్‌పై కనీస అవగాహన లేని ఇతర శాఖల నుంచి వచ్చిన అధికారులకు కీలకమైన విభాగాల బాధ్యతలు అప్పగించారు. ట్రస్ట్‌లో సదరు అధికారుల రచ్చ అంతా ఇంతా కాదు. ఒక అధికారి ఆస్పత్రులను ఎలా ఇబ్బందులు పెడతామని ఆలోచిస్తే.. మరో అధికారి ఆస్పత్రుల నుంచి వసూళ్లు చేసుకోవడం ఎలా అన్న దానిపైనే దృష్టి పెడుతున్నారన్న విషయం బహిరంగ రహస్యంగా మారింది. పేదవాడికి ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటే... సదరు అధికారులు మాత్రం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా వ్యవహరిస్తున్నారు.


Read more :

Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?

Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 02:52 AM