Share News

School Education Commissioner : ఒక్క బడినీ మూసేయం

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:14 AM

రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసేయడం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి.విజయరామరాజు స్పష్టం చేశారు.

School Education Commissioner : ఒక్క బడినీ మూసేయం

  • బడికి దూరంగా ఉండే విద్యార్థులకు నెలకు రూ.600 రవాణా ఖర్చుల కింద పది నెలల పాటు ఇస్తాం

  • ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్‌.. ప్రతి మూడో శనివారం మధ్యాహ్నం బడికి సెలవు

  • పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయరామరాజు.. మార్చి నాటికి 300 కోట్లు ఖర్చు చేయాలి: ఎస్పీడీ

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసేయడం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి.విజయరామరాజు స్పష్టం చేశారు. అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ల రెండు రోజుల అవగాహన సదస్సును సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం విజయవాడలో ఆయన ప్రారంభించారు. బడికి దూరంగా ఆవాసాలుంటే అక్కడి విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున పది నెలల పాటు రవాణా ఖర్చులు ఇస్తామని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్‌ను కేటాస్తామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో విద్యార్థుల నమోదుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై ప్రతి మూడో శనివారం మధ్యాహ్నం పాఠశాలలకు సెలవులు ఇచ్చి, స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలను పూర్తిగా అకడమిక్‌ అంశాలపై నిర్వహిస్తామని తెలిపారు. ఎస్పీడీ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... పీఎంశ్రీ పాఠశాలలకు రూ.100 కోట్లు, ఇతర పనులకు రూ.200 కోట్లు ఇటీవల విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులను మార్చి నెలాఖరు నాటికి పూర్తిగా వినియోగించాలని కోరారు.

Updated Date - Feb 12 , 2025 | 05:14 AM