Share News

Prakasam District : పారాణి ఆరనే లేదు...

ABN , Publish Date - Feb 19 , 2025 | 06:08 AM

నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా కంభం మండల దేవనగరంలో మంగళవారం చోటుచేసుకొంది.

Prakasam District : పారాణి ఆరనే లేదు...

  • వివాహమైన మూడో రోజే నవ వధువు ఆత్మహత్య

కంభం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కాళ్లపారాణి ఆరక ముందే ఓ నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా కంభం మండల దేవనగరంలో మంగళవారం చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. దేవనగరం గ్రామానికి చెందిన బి.లింగయ్య, సువార్తమ్మ కుమార్తె సుస్మిత(21)కు పెద్దారవీడు మండలం సిద్దినాయుడుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు ఈనెల 16న వివాహమైంది. పెళ్లికుమారుడి గ్రామంలో వివాహం జరిగింది. సోమవారం ఉదయం సుస్మిత, వెంకటేశ్వర్లు దేవనగరం వచ్చారు. దేవనగరం నుంచి వరుడు గ్రామానికి బుధవారం సారె తీసుకుని వెళ్లాలి. అందుకోసం మంగళవారం ఉదయం నుంచి కుటుంబసభ్యులు హడావుడిగా ఉన్నారు. ఆ సమయంలో సుస్మిత తాను బాబాయి వాళ్ల ఇంట్లో నిద్రపోతానని వెళ్లింది. పెళ్లికుమారుడు అత్తగారి ఇంట్లో నిద్రపోయాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సుస్మితను భోజనానికి పిలిచేందుకు అన్న మహేష్‌ వెళ్లాడు. ఇంట్లో చెల్లెలు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉండటం గమనించి కిందికి దించాడు. విషయం తెలిసి కుటుంబసభ్యులు, బంధువులు వచ్చి చూసి అప్పటికే మృతిచెందినట్టు గుర్తించారు. వివాహమైన మూడో రోజే సుస్మిత అఘాయిత్యానికి పాల్పడటంతో రెండు కుటుంబాల వారు బోరున విలపిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఇష్టంలేని పెళ్లి చేశారని, దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పెళ్లికుమారుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు ఎస్సై నరసింహారావు తెలిపారు.

Updated Date - Feb 19 , 2025 | 06:08 AM