Kavya Krishna Reddy: కావలిలో ఉద్రిక్తం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం గాలింపు
ABN , Publish Date - Aug 20 , 2025 | 09:57 AM
కావలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి చెందిన క్రషర్ వద్ద వైసీపీ రౌడీ మూకలు బుధవారం దౌర్జన్యానికి దిగారు.
నెల్లూరు, ఆగస్టు 20: కావలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి చెందిన క్రషర్ వద్ద వైసీపీ రౌడీ మూకలు బుధవారం దౌర్జన్యానికి దిగారు. ఆ క్రమంలో క్రషర్ సిబ్బందిపై మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే.. క్రషర్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురి అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డితోపాటు మరో నలుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే వారిలో ఇద్దరు రౌడీ షీటర్లని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డితోపాటు మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే వారి గాలింపు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డిని హతమార్చేందుకు రామిరెడ్డి కుట్రలకు తెర తీశారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి స్వయంగా తానే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.