APSRTC: కంచె.. మేస్తోంది
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:13 AM
ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగే సంస్థల్లో అవినీతి అక్రమాలకు తావులేకుండా విజిలెన్స్ విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ ఏపీఎ్‌సఆర్టీసీలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తోంది.
ఆర్టీసీలో నిఘా అధికారుల అవినీతి పర్వం
ఆధారాలతో సహా ఫిర్యాదులు
కడప జోన్‌లో విజిలెన్స్ అధికారి విశ్వరూపం
దళారీలను పెట్టుకుని మరీ వసూళ్లు
మహిళా ఉద్యోగికి బెదిరింపులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కళ్లు, చెవులు ఒక మనిషికి ఎంత ముఖ్యమో.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా ఒక సంస్థకు అంతే ముఖ్యం. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగే సంస్థల్లో అవినీతి అక్రమాలకు తావులేకుండా విజిలెన్స్ విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ ఏపీఎ్‌సఆర్టీసీలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తోంది. కంచే చేను మేసిన చందంగా.. విజిలెన్స్ విభాగమే అవినీతి కూపం అయిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఐజీ ర్యాంకు ఐపీఎస్ అధికారిని ఆర్టీసీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించేది. జోన్ల వారీగా డీఎస్పీ ర్యాంకు అధికారులు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్లుగా ఉండేవారు. అప్పట్లో ఏ చిన్న అతిక్రమణ కనిపించినా నివేదికలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపేవారు. లోపాలు, అవినీతిపై ఆధారాలతో సహా రిపోర్టులు ఎండీకి చేరేవి. తక్షణమే చర్యలుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. విజిలెన్స్ విభాగం ఆర్టీసీ అడ్మిన్ ఈడీ చేతుల్లో ఉండటమే అందుకు ప్రధాన కారణమని సిబ్బంది చెబుతున్నారు.
కడప జోన్‌లో వరుస ఫిర్యాదులు
కడప జోన్‌లో పనిచేస్తున్న వీ అండ్ ఎస్‌వో డబ్బుల కోసం వేధిస్తున్నారని ఆర్టీసీ కానిస్టేబుళ్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. కడప జోనల్ వర్కుషాపులో పనిచేసే రంగనాథ్ అనే ఉద్యోగి తనను విజిలెన్స్ అధికారి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వివరిస్తూ రాతపూర్వకంగా అవినీతి బాగోతాలు ఎండగట్టారు. ఆయన అవినీతిని ఉద్యోగ సంఘాలు ఆధారాలతో సహా యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చాయి. రూ. 10 వేల నుంచి 75 వేల వరకూ ఆన్‌లైన్‌లో పంపినట్టు కంప్లయింట్‌లో పేర్కొన్నారు. కొందరు హెడ్ కానిస్టేబుళ్లను దళారీలు పెట్టుకుని రాయలసీమలో వసూళ్లు చేస్తున్న వైనాన్ని వివరించారు. పులివెందులలో కేవీ రెడ్డి, కడపలో ప్రసాద్, నంద్యాలలో రామచంద్రారెడ్డి, కర్నూలులో మనోహర్, ఉమ్మడి అనంతపురంలో నాగసుందర్, గిరి ప్రతి పనికీ డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
విజయవాడ జోన్‌లోనూ ఇదే పరిస్థితి..
కడప జోన్ విజిలెన్స్ అధికారికి తీసిపోని విధంగా విజయవాడ జోన్ విజిలెన్స్ అధికారిపైగా వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. బస్టాండులో షాపుల నుంచి వసూళ్లు మొదలుకొని పలు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బస్టాండులోకి వచ్చి ప్రైవేటు వాహనాల వ్యక్తులు ప్రయాణికుల్ని బయటికి తీసుకెళ్లి పోతున్నా మామూళ్లతో ఆయన కళ్లు మూసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అద్దె కార్లకు ఆర్టీసీ డ్రైవర్లను వాడుతోన్న అధికారులపైనా ఫిర్యాదు చేయడం లేదని, లక్షలాది రూపాయల కొనుగోళ్ల వ్యవహారంలో ఆడిట్ అధికారులకు బిల్లులు పంపట్లేదని, టోల్ ఫీజు కోట్లలో పోతున్నా కనీసం అప్రమత్తం చేయడం లేదంటూ విజయవాడ జోన్ అధికారులపై ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఉన్నతాధికారికి బహుమతులు ఇస్తూ వీరు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
‘కారుణ్యం’ లేకుండా బెదిరింపులు
కడప రీజియన్‌లో పనిచేసే ఒక ఉద్యోగి మరణించడంతో ఆయన భార్యకు సెక్యూరిటీ కానిస్టేబుల్‌గా కారుణ్య నియామకం కింద ఆర్టీసీలో ఉద్యోగం లభించింది. అయితే ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోవడంతో విజిలెన్స్ అధికారి బ్లాక్ మెయిల్‌కు దిగారు. పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఉద్యోగం తీయించేస్తా.. అని బెదిరించి ఆమె వద్ద రూ. 5 లక్షల వరకూ వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. ఇలాంటి ఫిర్యాదులపై ఎట్టకేలకు యాజమాన్యం స్పందించి విజిలెన్స్ ఉన్నతాధికారిని విచారణకు పంపింది. అయితే విచారణ అధికారితో వసూళ్ల అధికారికి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ముందే బాధితులను పిలిచి బహిరంగంగా విచారణ చేపట్టారు. ఎవరిపై తాము ఫిర్యాదు చేశామో.. ఎవరి పరిధిలో పని చేస్తున్నామో.. ఆయన సమక్షంలోనే విచారణ చేపట్టడం అంటే దీనిని పూర్తిగా నీరుగార్చడమేనని బాధితులు వాపోతున్నారు. కడప జోన్‌లో సిబ్బందిని వేధిస్తోన్న విజిలెన్స్ అధికారిపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి. విచారణలో అవి నిరూపితం కావడంతో యాజమాన్యం రివర్షన్ ఇచ్చింది. అయితే ఒక మహిళా అధికారి ఆశీర్వాదంతో కొన్ని నెలల్లోనే తిరిగి అదే పోస్టులో నియమితులయ్యారు. వారిద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలకు ఇదే నిదర్శనం అని రాయలసీమ బస్ డిపోల్లో సిబ్బంది బహిరంగంగా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..
భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా
Read Latest AP News And Telugu News