Share News

National Industrial Corridor : ఉత్పాదక, పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్ర

ABN , Publish Date - Feb 01 , 2025 | 04:32 AM

జాతీయ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక పారిశ్రామిక నగరం ఏర్పడుతుందని..

National Industrial Corridor : ఉత్పాదక, పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్ర

  • అత్యాధునిక పారిశ్రామిక నగరం దిశగాకృష్ణపట్నంలో పనులు ప్రారంభం

  • రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడిలోఅత్యధిక వాటా జీఎస్టీదే.. కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): జాతీయ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక పారిశ్రామిక నగరం ఏర్పడుతుందని, అది ప్రధాన ఉత్పాదక పెట్టుబడుల కేంద్రంగా మారుతుందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో 4 పారిశ్రామిక నగరాలు ఏర్పడ్డాయని, రాష్ట్రంలోని కృష్ణపట్నంలో ఆ దిశగా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. సొంత పన్ను వసూళ్లు, రెవెన్యూ వసూళ్లు 50 శాతం పైగా అధికంగా ఉన్న 15 రాష్ట్రాల్లో ఏపీ ఒకటని.. అయితే సొంత రెవెన్యూ రాబడిలో అత్యధిక వాటా జీఎస్టీయేదేనని పేర్కొంది. దేశంలో స్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థానికం చేయడం వల్ల అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ది చేయవచ్చని అభిప్రాయపడింది. ఆంధ్ర సహా పది రాష్ట్రాల్లో నెలకొల్పిన ‘సమీకృత అభివృద్ధి లక్ష్యాల సమన్వయ కేంద్రాలు (ఎస్‌డీజీసీసీలు)’ ఈ దిశగా పనిచేస్తున్నాయని తెలిపింది. రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక సర్వే ప్రస్తావించిన మరిన్ని కీలక అంశాలివీ..


  • ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, హరియాణా రాష్ట్రాల్లో మహిళల అవకాశాలపై ప్రతిబంధకాలు తొలగించారు. ఐటీ ఉద్యోగాల్లో మహిళలు రాత్రివేళ పనిచేయడంపై ఏపీలో నిషేధాలు సడలించారు.

  • చైనా తర్వాత అత్యధికంగా సిమెంట్‌ ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియా. ఇందులో ఏపీ, తెలంగాణ సహా 13 రాష్ట్రాల్లో 87 శాతం ఆ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది.

  • పత్తి ఉత్పత్తి ఆంధ్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లో విస్తరించింది. అయితే వస్త్ర పరిశ్రమతో దానిని అనుసంధానించలేదు. చైనాలో మాదిరిగా ఫైబర్‌ టు ఫ్యాషన్‌లా అనుసంధానం చేసి నాణ్యతను కొనసాగిస్తూ.. తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలు కల్పించాలి.

  • వైద్య విద్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 4 దక్షిణాది రాష్ట్రాల్లోనే అధిక అవకాశాలు లభ్యమవుతున్నాయి. 51ుఅండర్‌ గ్రాడ్యుయేట్‌ (ఎంబీబీఎస్‌) సీట్లు, 49 శాతం పీజీ సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 04:32 AM