Nara Lokesh: రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాక.. మంత్రి లోకేశ్ వెల్లడి
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:33 PM
ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు రాబోతున్నట్టు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ నెల 14, 15న విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సదస్సు నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రజ్యోతి, నవంబర్ 12: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి విదేశీ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో పెద్ద ప్రాజెక్ట్ రాష్ట్రానికి రానుందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 'X' వేదికగా వెల్లడించారు. 2019లో కొత్త కంపెనీలను ఆపేసిన ఆ ప్రాజెక్ట్.. ఈసారి తుపాన్‌లా భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి రాబోతోందని ఆయన అన్నారు. దీనిపై గురువారం ఉదయం 9 గంటలకు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని లోకేశ్ తెలిపారు.
విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీలలో భారత పరిశ్రమల సమాఖ్య(Confederation of Indian Industry-CII) సదస్సు నిర్వహించనున్నట్టు మంత్రి లోకేశ్ చెప్పారు. పెట్టుబడులకు ఏపీ ఎంతో అనుకూలం అన్న మంత్రి.. ఈ సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించామన్నారు. ఇందుకోసం విదేశీ సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని స్పష్టం చేశారు.
టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు రాష్ట్రానికి రానున్నాయని ఈ సందర్భంగా లోకేశ్ తెలిపారు. అయితే.. రాబోయే పెట్టుబడులకు త్వరితగతిన వసతులు కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. ఇందుకోసం తగిన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి రాబోతున్న వాటిలో ఐటీ, తయారీ, సేవలు, పర్యాటక రంగాలు కీలకమని మంత్రి అన్నారు.
ఇవీ చదవండి:
విశాఖ సీఐఐ సమ్మిట్.. చంద్రబాబు పర్యటన అప్‌డేట్స్
టీటీడీ కల్తీ నెయ్యి కేసు... సీబీఐకి ధర్మారెడ్డి కీలక సమాచారం