AP News: నోరూరించే ‘మోరి’.. అక్కడి జీడిపప్పునకు ఒక ప్రత్యేకత ఉందిమరి..
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:03 AM
చిటపట కాలుతున్న కమ్మని వాసన.. వేగిన గింజల గళగళలు.. టప్‌టప్‌మంటూ ఒక్కొక్క గింజనే పగలగొడుతున్న శబ్దాలు.. ప్రత్యేకించి యంత్రాల సందడి.. ఇలా అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎవరి పనుల్లో వారు బిజీగా కనిపిస్తారు. అతి ఖరీదైన గింజల్ని.. అతి కష్టం మీద ఉత్పత్తి చేసే శ్రమైక జీవన సౌందర్యం చూపరులను అబ్బురపరుస్తుంది.
జీడిపప్పు.. ఆహా.. ఆ పేరెత్తగానే నోరూరుతుంది. తింటే లావు అవుతారనీ, కొవ్వు పెరుగుతుందనీ.. ఇలా ఎవరెన్ని చెప్పినా సరే.. రెండు జీడిపప్పు పలుకులు నోట్లో వేసుకోనిదే ప్రాణం ఊరుకోదు. మార్కెట్‌లో రకరకాల జీడిపప్పులు ఊరిస్తున్నాయి... కానీ తూర్పు గోదావరి జిల్లాలోని ‘మోరి’ జీడిపప్పునకు ఒక ప్రత్యేకత ఉంది. అదే ‘కాల్చిన జీడిపప్పు’. ఇప్పటికీ సంప్రదాయ పద్దతుల్లో జీడి నుంచి పప్పును వేరుచేసి.. అత్యంత రుచికరమైన జీడిపప్పును సరఫరా చేస్తున్నారు గ్రామస్థులు...
చిటపట కాలుతున్న కమ్మని వాసన.. వేగిన గింజల గళగళలు.. టప్‌టప్‌మంటూ ఒక్కొక్క గింజనే పగలగొడుతున్న శబ్దాలు.. ప్రత్యేకించి యంత్రాల సందడి.. ఇలా అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎవరి పనుల్లో వారు బిజీగా కనిపిస్తారు. అతి ఖరీదైన గింజల్ని.. అతి కష్టం మీద ఉత్పత్తి చేసే శ్రమైక జీవన సౌందర్యం చూపరులను అబ్బురపరుస్తుంది. అటుగా వీధుల్లో వెళుతుంటే.. పసందైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. అలాంటి వీధులున్న వింత ఊరు తూర్పుగోదావరి జిల్లాలోని మోరి గ్రామం. ఇదెంత ఫేమస్సు అంటే.. ‘తింటే గింటే కాల్చిన మోరి జీడిపప్పు’నే తినాలనేంత!. కొన్నేళ్ల నుంచీ ఆ ఊరికి అంత పేరుంది మరి!. ప్రత్యేకించి కొన్ని చోట్ల మాత్రమే దొరికే కాల్చిన జీడిపప్పు మోరిలో దొరుకుతుంది. అందుకే ఆ ఊరు ఒక బ్రాండ్‌ను సృష్టించుకుంది.

‘మోరి...’ ఆ పేరే ఒక ప్రత్యేకం. ఇటీవలే స్మార్ట్‌విలేజ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మెల్లమెల్లగా అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా పేరొందింది. ఈ ఊరి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది జీడిపప్పు. ఇది మోరి గ్రామానికే బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. పూర్వకాలం నుంచి మోరి జీడిపప్పు పేరు ప్రఖ్యాతలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. ఈ ఊరికి అంత చరిత్ర ఉంది మరి! కాస్త వెనక్కి వెళితే.. అప్పట్లో జీడిపప్పు పరిశ్రమను ముప్పర్తి, ఆకుల, అడ్డాల కుటుంబాలు పరిచయం చేశాయి. మోరి గ్రామానికి చెందిన ముప్పర్తి వెంకటరత్నం అప్పట్లో విదేశాలకు కొబ్బరికాయలు ఎగుమతి చేస్తూ అక్కడ లభించే జీడిగింజలను తీసుకువచ్చి కుండపెంకులపై కాల్పించి పప్పు తయారు చేసేవారట. అప్పట్లో జీడిపప్పును ఎండలో ఆరబెట్టి పాలకొల్లు సంతల్లో అమ్మేవారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు సైతం పాలకొల్లుకు వచ్చి కొనుక్కునేవారట. జీడిపప్పుతో ఇంత హడావిడి చేసే మోరిలో మాత్రం పంట లేదు. పూర్వ కాలంలోనే ముప్పర్తి, ఆకుల కుటుంబాలు ఆఫ్రికా వంటి దేశాల నుంచి ముడి గింజలు దిగుమతి చేసుకుని పప్పును తయారు చేసేవారు. అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసి పేరు ప్రఖ్యాతలు సాధించారు.

కాల్చిన జీడిపప్పునకు గిరాకీ..
అప్పట్లో జీడి గింజలను మట్టి పొయ్యిలు ఏర్పాటుచేసి.. ఇనుప మంగళం తయారుచేయించి.. పొయ్యిని జీడిగుల్లతో మండించి .. కిలో చొప్పున గింజలు కాల్చేవారు. అలా కాల్చిన గింజను కొలుములు అంటే పది మంది మహిళలను గ్రూపుగా ఏర్పాటుచేసి కుంచాల లెక్కన కొట్టించేవారు. 80 కిలోల గింజలు కాల్చితే ఎనిమిది కుంచాల ముడిపప్పు (24 కిలోలు) రావాలి. కుంచముల లెక్కన మజూరీ ఇచ్చేవారు. ఆ విధంగా తయారైన ముడిపప్పు అటాసులో (హీట్ హౌస్)లో 12 గంటలు ఉంచేవారు. హీట్‌హౌస్‌లో ఇరువైపులా 12 జల్లెడలు చొప్పున 24 ఉండేవి. ముడిపప్పును ఆ జల్లెడలో సర్ది తలుపులు బిగించి లెక్కవారీగా జీడిగుల్లతో మండించేవారు. నాలుగు గంటల అనంతరం జల్లెడలను మార్చేవారు. దీనినే తిరగేతా అనేవారు.

రాత్రి అంతా అటాసులో ఉంచి ఉదయమే ఇంటికి వచ్చి మళ్లీ ఆరు కిలోల వంతున (తొట్టె పప్పు) ఒలుపునకు ఇచ్చేవారు. పూర్వం ఆరు కిలోల ముడిపప్పు ఒలిచినందుకు కిలోకు 10 పైసలు ఇచ్చేవారు. రానురాను ఆ రేటు పెరిగింది. ఈ విధంగా ఒలిచిన పప్పును గ్రేడింగ్ చేసేవారు. గుళ్లు, బద్ద, ముక్కగా విభజించేవారు. 80 కిలోల గింజలకు 24 కిలోల ముడిపప్పు వస్తే వేడి పప్పు 21 కిలోలు వచ్చేది. వేడిపప్పును ఒలవగా 18 కిలోల నుంచి 20 కిలోల తెల్ల పప్పు వచ్చేది. ఈ విధంగా తయారైన పప్పును 10 కిలోల వంతున డబ్బాల్లో ప్యాక్ చేసి, విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. ఈ విధంగా మంగళంపై కాల్చి హీట్ హౌస్‌లో వేడి చేసిన జీడిపప్పు రుచి అద్భుతం. ఎక్కువ కాలం అంటే.. మూడు నుంచి ఆరు నెలల వరకు నిల్వ ఉండేది. ఇప్పటికీ కాల్చిన గింజలు (రోస్టెడ్ పప్పు)కు డిమాండ్, మార్కెట్ బాగుంది.
ఆఫ్రికా నుంచి ...
ముడి గింజలు ఆఫ్రికా వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యేవి. రానురాను మన రాష్ట్రంతో పాటు కేరళ వంటి రాష్ట్రాల్లో జీడి గింజ పంట విస్తీర్ణం పెరిగింది. ఎక్కువగా పూర్వపు పశ్చిమ గోదావరిజిల్లా అనగా జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, కొయ్యలగూడెం, దేవరపల్లి, కామవరపుకోట, దూబచర్ల, దిప్పకాయలపాడు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, సీతానగరం, రంపచోడవరం వంటి ఏజెన్సీ ప్రాంతాల నుంచి కొనుగోలుచేసి మోరికి తీసుకువచ్చి బస్తాలు లెక్కన పంచుకుని కాల్చుకునేవారు. పూర్వం, మోరి, మోరిపోడు ఒకే రెవెన్యూ గ్రామంగా ఉండేవి. కాలక్రమంలో పరిపాలనా సౌలభ్యం కోసం మోరి నుంచి మోరిపోడుగా విభజించబడ్డాయి. మోరి, మోరిపోడులలో సుమారు 300 నుంచి 400 కుటుంబాల వరకు జీడిపప్పు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. గింజలు కొట్టడం నుంచి పప్పు వేరుచేయడం, గ్రేడింగ్ వంటి పనులలో మహిళలదే పైచేయి. గింజల కొనుగోలు, కాల్చడం, అమ్మకాలు వంటి వాటిలో పురుషుల పాత్ర ఉంటే, నల్లని గింజల నుంచి తెల్లని పప్పు తయారు చేయడంలో మహిళల పాత్ర కీలకం.

యంత్రాలతో పరుగెడుతోంది..
మారుతున్న కాలంతో పాటు జీడిపప్పు వ్యాపారులు కూడా యాంత్రీకరణ వైపు అడుగులు వేశారు. కేరళ, పలాస వంటి ప్రాంతాల నుంచి బాయిలర్ యూనిట్లు, పప్పు ఒలిచే యంత్రాలను రంగంలో దింపారు. పలాస, తడికిమళ్ల, దేవరపల్లి వంటి ప్రాంతాల్లో యంత్రాలపై తయారైన పప్పును మార్కెట్‌లో తక్కువ రేటుకు విక్రయించడంతో పోటీని తట్టుకోవడానికి మోరి జీడిపప్పు వ్యాపారస్తులు కూడా యాంత్రీకరణపై దృష్టి పెట్టారు. బాయిలర్‌లో గింజలను ఉడకపెట్టి చల్లారిన తరువాత చిన్నచిన్న యంత్రాలపై మహిళలతో కట్ చేయిస్తారు. తరువాత ఆ పప్పు ఒలుపు మిషన్‌పై పంపి తెల్లపప్పును తయారు చేస్తారు. ఈ విధంగా తయారైన పప్పు ఎక్కువకాలం నిల్వ ఉండదని అంటారు. యాంత్రీకరణ వచ్చాక జీడిపప్పు తయారీ మాత్రం విపరీతంగా పెరిగింది. ఒలుపుపై ఆధారపడిన మహిళలకు యంత్రాల కారణంగా పనిలేకుండా పోయింది.
ఆ జీడిపప్పుకు ఎప్పుడూ డిమాండే..
జీడి గింజలను డ్రమ్ములలో కాల్చి కొలుముల్లో కొట్టించి తయారుచేసిన జీడిపప్పునకు ఎప్పుడూ డిమాండే. కాల్చిన పప్పును తయారుచేసే వ్యాపారస్తులు ఎన్ని రోజులైనా భయం లేకుండా అనుకున్న రేటు వచ్చాకే అమ్ముతారు. కాల్చిన పప్పు రుచిగా ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. బాయిలర్ పప్పు కంటే కిలోకు రూ.50 అదనంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి మోరి వచ్చిన వారు కాల్చిన జీడిపప్పు అడిగి మరీ కొంటారు.

జీడిపప్పునకు మోరిలో మంచి పేరు ఉండడంతో పాటు ఇటీవల జీడిపప్పు అచ్చుల (మిఠాయి)కు గిరాకీ పెరిగింది. చాలా కుటుంబాలు జీడిపప్పు అచ్చుల (మిఠాయి) తయారీపై శ్రద్ధ చూపుతున్నాయి. మోరి నుంచి పెళ్లిళ్లకు, పుట్టినరోజులకు వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలకు జీడిపప్పు అచ్చును గిఫ్ట్‌గా ఇవ్వడం ఆనవాయితీగా మారింది. కిలో, అర, పావు కిలోల సైజుల్లో అచ్చులు తయారుచేసి హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారిప్పుడు. మోరి జీడిపపప్పు అచ్చును గట్టి పాకంతో తయారు చేస్తారు. ఎన్నాళ్లైనా నిల్వ ఉండటం దీని ప్రత్యేకం. కిలో రూ.600 ధర పలుకుతోంది.
మోరి ప్రత్యేకతలెన్నో..
ఈ ఊరు కేవలం జీడిపప్పుకే కాదు.. అనేక విషయాల్లో ప్రత్యేకతలు ఉన్నాయి. బ్రిటిష్‌వారిపై స్వాతంత్య్రం కోసం ముందుగా తిరగబడ్డ గ్రామంగా చరిత్రలో స్థానం సంపాదించుకుంది. ముప్పర్తి వెంకటరత్నం వంటి నాయకులు స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో ఎందరినో కలుపుకుని బ్రిటీషువారిపై తిరగబడి జైళ్లలో మగ్గారు. ఉవ్వెత్తున సాగుతున్న స్వాతంత్య్ర ఉద్యమానికి చేనేత ఉద్యమం తోడైంది. విదేశీ దుస్తుల బహిష్కరణకు పిలుపునిచ్చిందీ ఊరు. స్వదేశీ చేనేతను ప్రోత్సహించండి అన్న మహాత్మాగాంధీ పిలుపుతో
దేశవ్యాప్తంగా పెనుమార్పులు వచ్చాయి. విదేశీ వస్ర్తాలను తగలబెట్టి ఖాదీ, చేనేత వస్ర్తాలు తయారు చేయడం, ప్రోత్సహించడం, ధరించడం మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే 1937లో మోరిలో చేనేత సొసైటీని స్థాపించారు. చింతా శివాచార్యులు, జాన శంకరయ్య
నేతృత్వంలో ఈ సొసైటీ ఏర్పాటైనట్లు స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా జనవరి 23, 1939లో జాన శంకరయ్య తన తండ్రి పేరున నాగయ్య పుస్తక భాండాగారం (లైబ్రరీ) ఏర్పాటుచేశారు. అది నేటికీ కొనసాగుతోంది. మోరి చేనేతకు ఉన్న ప్రాముఖ్యతకు గుర్తింపుగా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోరి చేనేత కార్మికులు నేసిన చీరను ఢిల్లీలో జరిగిన ప్రదర్శనలో కొనుగోలు చేయడం విశేషం.
స్మార్ట్ విలేజ్‌గానూ..
మోరి జీడిపప్పు గ్రామమే కాదు.. స్మార్ట్ విలేజ్ కూడా! అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరిగిన గ్రామంగా పేరుతెచ్చుకుంది. డిసెంబరు 29, 2016లో అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మోరిలో స్మార్ట్ విలేజ్‌ను ప్రారంభించారు. దీనిలో భాగంగా డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచారు. డ్వాక్రా మహిళలకు, చిరు వ్యాపారులకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెరగడంతో అప్పటి నుంచి మోరిలో చాలా వరకు డిజిటల్ లావాదేవీలే జరుగుతాయి.
ఇక, మోరి అన్నిరంగాల్లోనూ ముందుండడంతో పాటు కళాకారులకు పుట్టిల్లు కూడా. పలు పౌరాణిక, సాంఘిక నాటకాల ప్రదర్శనలు జరిగాయి. ఊర్లో ఎక్కువ మంది వైద్యులుగా స్థిరపడ్డారు. మోరికి చెందిన ముప్పర్తి, జాన కుటుంబాల ప్రోత్సాహంతోనే అంతర్వేదిపాలెం తిర్కా డెవలప్‌మెంట్ ట్రస్టును ఏర్పాటుచేసి విద్యాభివృద్ధికి పాటుపడ్డారు. ముందుగా మోరిలోనే పోస్టాఫీసు, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లు ఏర్పాటయ్యాయి.
.... ఇలా ‘మోరి’ గ్రామం కేవలం కాల్చిన జీడిపప్పు ఉత్పత్తిలోనే కాదు.. ఇటీవలే స్మార్ట్ విలేజ్‌గానూ ప్రభుత్వ రికార్డులకెక్కింది. ఊర్లో ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయ పరిశ్రమను మరింత ప్రోత్సహిస్తే.. స్థానికులకు శాశ్వత ఉపాధి లభిస్తుంది. ఎగుమతుల ద్వారా ప్రభుత్వానికి పన్నుల లాభం చేకూరుతుంది.. అంటున్నారు గ్రామస్థులు.
- వుంగరాల కొండలరావు,
మలికిపురం, తూర్పుగోదావరి
‘‘మా ఊరికి పేరు ప్రఖ్యాతలు జీడిపప్పు వల్లనే వచ్చాయి. మా కుటుంబాలకు కూడా ఇదే ఆధారం. ఏళ్ల తరబడి జీడి గింజలు కొడుతున్నాను. ఇదే నాకు ఉపాధి. అయితే ఈ మధ్య గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం కొన్ని రాయితీలను ప్రకటించి.. జీడి పరిశ్రమలోని మహిళా కార్మికులను ఆదుకుంటే మంచిది. స్థానిక పరిశ్రమలను బతికించిన వారవుతారు..’’
- ముత్యాల సత్యవతి, జీడిపప్పు పరిశ్రమ కార్మికురాలు, మోరి
‘‘పదిమంది కలిస్తే ఒక బృందం అవుతుంది. అదే మా బలం. ఒక్కరే పని చేసే పరిశ్రమ కాదిది. అందరం కలిసికట్టుగా చేస్తేనే ఫలితం లభిస్తుంది. అందుకే మేము పది మంది కలిసి జీడి గింజలు తెచ్చుకుంటాం. కాల్చిన జీడిపప్పునే తయారు చేస్తాం. ఎక్కువగా మోరి ఎవరు వచ్చినా ఈ రకం పప్పునే అడుగుతారు. ఇది చాలా కాలం నిల్వ ఉంటుంది. మంచి రుచి కూడా! ఈ ప్రత్యేకతను నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాం..’’
- అడ్డాల సింహాచలం, జీడిపప్పు వ్యాపారస్తుడు, మోరి
‘‘మోరి జీడిపప్పునకు తెలిసిన వినియోగదారులే ఎక్కువ. వాళ్లకు కావాల్సినంత సరుకును నాణ్యత తగ్గకుండా సరఫరా చేస్తే చాలు. మాకు హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, రాజమహేంద్రవరంలలో బంధుమిత్రులు ఉన్నారు. తరచూ కాల్చిన జీడిపప్పు, జీడిపప్పు అచ్చులు (మిఠాయి) కొనుగోలుచేసి పంపిస్తూ ఉంటాం. కొన్నేళ్ల నుంచీ ఇలా తెలిసిన వాళ్లకే విక్రయిస్తున్నాం..’’
- వీరా వెంకటరామారావు, సొసైటీ అధ్యక్షుడు, వీవీమెరక
‘‘మా సొంతూరు ఇదే! బయట మార్కెట్‌లో రకరకాల ప్రాంతాల నుంచి జీడిపప్పు వస్తోంది. ధరల్లోనూ వ్యత్యాసం ఉంది. కానీ.. మా ఊర్లో దొరికే కాల్చిన జీడిపప్పునకు ఇప్పటికీ డిమాండ్ తగ్గడం లేదు. దీనిని ఒక్కసారి తింటే మళ్లీ మరో రకం జీడిపప్పును తినలేరు. అంత రుచికరం. బాయిలర్ పప్పు కంటే కాల్చిన పప్పు ధర కాస్త ఎక్కువ ఉన్నాసరే కొంటున్నారు. తింటున్నప్పుడు సంతృప్తి ముఖ్యం..’’
- యర్రాప్రగడ ప్రతాప్, లేఖరి, మోరి