Share News

Cyclone Montha: కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకిన మొంథా తుపాన్

ABN , Publish Date - Oct 28 , 2025 | 07:58 PM

కాకినాడ-మచిలీపట్నం మధ్య మొంథా తుపాన్ తీరాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో తుపాన్ కదిలిందని తెలిపారు.

Cyclone Montha: కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకిన మొంథా తుపాన్
Cyclone Montha

అమరావతి, అక్టోబర్ 28: ఆంధ్ర‌ప్రదేశ్‌లోని కాకినాడకు సమీపంలో మొంథా తుపాన్ (Cyclone Montha) తీరాన్ని తాకిందని అమరావతి ఐఎండీ ప్రకటించింది. పూర్తిగా తీరాన్ని దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటలు సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. కాకినాడ-మచిలీపట్నం మధ్య మొంథా తుపాన్ తీరాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ( MD Prakhar Jain) వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో తుపాన్ కదిలిందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 120 కిమీ, కాకినాడకి 110 కిమీ, విశాఖపట్నానికి 220 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. పూర్తిగా తీరం దాటడానికి 3-4 గంటల సమయం పడుతోందన్నారు. దీని ప్రభావంతో కోస్తా వెంబడి గంటకు 90-100 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించారు. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలన్నారు.


కృష్ణా జిల్లాలోని గుడివాడలో తుఫాను ప్రభావంతో భారీ గాలులతో పలుచోట్ల ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, గుడివాడ ముదినేపల్లి ప్రధాన రహదారిలో వృక్షాలు నేలకూలాయి. గుడివాడ - విజయవాడ ప్రధాన రహదారిలో వృక్షాలు నేలకొరిగాయి. దీంతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. హుటాహుటిన విపత్తు స్పందన & అగ్నిమాపక శాఖ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. చిమ్మ చీకటిలో ఆధునిక యంత్ర సామాగ్రితో రోడ్లపై కూలిన చెట్లను బృందాలు తొలగిస్తున్నాయి. ముదినేపల్లి ప్రధాన రహదారిలో కూలిన వృక్షాలను గుడివాడ రూరల్ పోలీసులు తొలగించారు.


ప్రకాశం జిల్లాలో తుపాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురు గాలులతో ఒంగోలుతో పాటు తీర ప్రాంత గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రామన్న చెరువుకి గండి పడింది. ఒంగోలు - చీరాల రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు క్లియర్ చేస్తున్నారు. వర్షాల ధాటికి సంతనూతలపాడు చెరువు నిండి అలుగు పారుతుంది. ఒంగోలు - చీమకుర్తి రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చెట్లు పడి, విద్యుత్ తీగలు తెగి, స్తంభాలు కూలిన ప్రదేశాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పరిస్థితిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నిపిపివేసిన ప్రాంతాల్లో త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరించేలా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమస్య తలెత్తిన ప్రాంతాల్లో సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.


విశాఖపట్నంలో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలుల కారణంగా భారీ చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. కుండపోత వర్షం కురవడంతో వైజాగ్ లోని సింధియా రోడ్డు నీట మునిగింది. కొన్ని చోట్ల రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఒక ప్రాంతంలో కారుపై భారీ వృక్షం పడటంతో వాహనం ధ్వంసమైంది. కొన్ని ప్రదేశాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు చెట్లను తొలగిన్నారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ దుర్గగుడ ఘాట్ రోడ్డుని అధికారులు మూసివేశారు. కనకదుర్గ నగర్, లిఫ్ట్ మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలంటూ భక్తులకు అధికారులు సూచించారు.


మొంథా తుఫాన్ ప్రభావంపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఐదారుగురు సభ్యులతో బృందాన్ని పంపాలని అధికారులను ఆదేశించారు. పంట పొలాలు మునిగిపోకుండా డ్రెయిన్లు పటిష్ట పరచాలని సూచించారు. రహదారులు, చెరువులు, కాలువలకు గండ్లు పడితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టంపై ఆలస్యం చేయకుండా కేంద్రానికి వెంటనే నివేదిక ఇవ్వాలని సూచించారు. తుఫాన్ వల్ల నష్టం వాటిల్లితే అంచనాలు వేగంగా రూపొందించి, సాయం అందించేలా కార్యాచరణ చేపట్టారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 5,803 మండలాలపై మొంథా తుఫాన్ ప్రభావం ఉంటుందని చెప్పారు. మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణం మరమ్మతులు చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. విద్యుత్ సబ్ స్టేషన్ల, ఫీడర్లు నిరాటంకంగా పనిచేసేలా చూడాలన్నారు.


ఇవి కూడా చదవండి:

Cyclone Montha: పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు

Updated Date - Oct 28 , 2025 | 08:34 PM