Share News

Vijayawada ACB Court: జైలుకు మిథున్‌రెడ్డి.. 1 వరకు రిమాండ్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 03:35 AM

మద్యం కుంభకోణం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది.

 Vijayawada ACB Court: జైలుకు మిథున్‌రెడ్డి.. 1 వరకు రిమాండ్‌

  • రాజమహేంద్రవరం జైలుకు తరలింపు.. ఇరు పక్షాల తరఫున జోరుగా వాదనలు.. రిమాండ్‌పై అభ్యంతరం చెప్పని ఎంపీ

  • కోర్టు ప్రాంగణం వద్ద వైసీపీ నేతల యాగీ

  • నినాదాలతో హల్చల్‌.. పోలీసులతో వాగ్వాదం

విజయవాడ/తిరుపతి(జీవకోన), జూలై 20(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్‌ విధిస్తూ న్యాయాధికారి పి. భాస్కరరావు ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. శనివారం సిట్‌ విచారణకు వచ్చిన మిథున్‌రెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్‌(సిట్‌) తరపున ఇ. కోటేశ్వరరావు, సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, మిథున్‌రెడ్డి తరఫున హైకోర్టు సీనియర్‌ న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. న్యాయాధికారి బెంచ్‌ మీదకు వచ్చిన వెంటనే మిథున్‌రెడ్డిని కోర్టు హాలులోకి పిలిచారు. న్యాయాధికారి భాస్కరరావు తొలుత మిథున్‌రెడ్డిని పేరు అడిగారు. అనంతరం, నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. ‘‘రిమాండ్‌పై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మిథున్‌రెడ్డి మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రోటెం స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఆయనకు ‘వై’ కేటగిరి భద్రత ఉంది.’’ అని చెప్పారు. దీనిపై న్యాయాధికారి.. మిథున్‌రెడ్డిని ప్రశ్నించగా.. తనకు ఎనిమిది మంది గన్‌మన్లతో కూడిన ‘వై’ కేటగిరి భద్రత ఉందని వివరించారు. మిథున్‌పై నమోదు చేసిన సెక్షన్లలో ఐపీసీ 409 వర్తించబోదని న్యాయవాది నాగార్జునరెడ్డి వాదించారు. వైద్య పరీక్షల నివేదికలో ఈసీజీకి సంబంధించి వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. ఈ విషయంపైనా మరోసారి మిథున్‌రెడ్డిని న్యాయాధికారి ప్రశ్నించారు. ఈసీజీలో రెండుసార్లు హెచ్చుతగ్గులు వచ్చాయని మిథున్‌రెడ్డి తెలిపారు. తర్వాత ఎకో-2డీ పరీక్షలు చేశారన్నారు. దీనికి సంబంధించి ఇంతకుముందున్న సమస్యను మిథున్‌రెడ్డి వివరించారు. ఆ రిపోర్టులను న్యాయాధికారికి ఇచ్చారు. దీనిపై సిట్‌ తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఇంతకుముందు వైద్య నివేదికలు ఎలా ఉన్నా ప్రభుత్వాసుపత్రి వైద్యుల నివేదిక మాత్రం రిమాండ్‌కు అనుకూలమేనని ఉందని వివరించారు. మద్యం కుంభకోణంలో మిథున్‌రెడ్డి నేరం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు. ఆయన దాఖలు చేసిన రెండు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు, సుప్రీం కోర్టు కొట్టేశాయని వివరించారు.


నెల్లూరు జైలుకు పంపండి: మిథున్‌

ఎంపీ మిథున్‌రెడ్డిని జైలుకు పంపే విషయంపై న్యాయాధికారి భాస్కరరావు.. నేరుగా ఆయననే అభిప్రాయం కోరారు. తనకు గుంటూరు, నెల్లూరు జైళ్లలో ఏదైనా ఫర్వాలేదని మిథున్‌ సమాధానం ఇచ్చారు. సిట్‌ తరఫు న్యాయవాది పోసాని స్పందిస్తూ.. మిథున్‌రెడ్డి ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి జైళ్ల శాఖ నిబంధనలు ఎలా ఉంటే అలా అధికారులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం అనుమతించాలని, ఐదు ములాఖత్‌లు ఇవ్వాలని, వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. వాటిపై పిటిషన్లు దాఖలు చేసుకోవాలని పోసాని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం మిథున్‌రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్‌ విధిస్తూ న్యాయాధికారి భాస్కరరావు తీర్పును వెలువరించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించాలని ఆదేశించారు. ఈ తీర్పును న్యాయాధికారి తన చాంబర్‌లో వెల్లడించారు. తీర్పు అనంతరం బయటకు వచ్చిన మిథున్‌రెడ్డి తర్వాత మళ్లీ చాంబర్‌లోకి వెళ్లారు. నెల్లూరు సెంట్రల్‌ జైలును కేటాయించాలని అభ్యర్థించారు. కానీ, న్యాయాధికారి అంగీకరించలేదు. ఇదిలావుంటే, సిట్‌ అధికారులు మిథున్‌ రెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు ఆయనకు క్యాజువాలిటీలో బీపీ, షుగర్‌, ఈసీజీ, ఎకో-2డీ పరీక్షలు చేశారు. ఈసీజీ రెండుసార్లు నిర్వహించగా హెచ్చుతగ్గులు రావడంతో ఎకో-2డీ పరీక్ష చేసి ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించారు.


కోర్టు ప్రాంగణంలో రెచ్చిపోయిన నేతలు

ఎంపీ మిథున్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచడంతో ఆయనను పరామర్శించేందుకు వైసీపీ నేతలు భారీగా అక్కడకు చేరుకున్నారు. రిమాండ్‌ విధించిన తర్వాత మిథున్‌రెడ్డిని జైలుకు తరలించడానికి పోలీసులు ఆయనను బయటకు తీసుకురాగా వైసీపీ నేతలు నినాదాలతో రెచ్చిపోయారు. ‘జై మిథున్‌రెడ్డి’ అంటూ న్యాయస్థానాల ప్రాంగణం అనే స్పృహ కూడా లేకుం డా హల్చల్‌ చేశారు. దీంతో కోర్టుకు వచ్చిన వారితోపా టు న్యాయవాదులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఆ జైలు.. ఈ జైలు!

‘‘రిమాండ్‌ విధిస్తే ‘వై’ కేటగిరి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ తరహా సదుపాయాలు ఉన్న జైలుకు పంపాలి. రాజమహేంద్రవరం, నెల్లూరులో సెంట్రల్‌ జైళ్లు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు విజయవాడకు సమానదూరంలో ఉన్నాయి. రాజమహేంద్రవరం జైలు కంటే నెల్లూరు సెంట్రల్‌ జైల్లో సదుపాయాలు ఎక్కువ., ఆ జైలుకు పంపే విషయాన్ని పరిశీలించాలి.’’

- మిథున్‌ రెడ్డి తరఫు న్యాయవాది మన్మధరావు


మిథున్‌ మూడు పిటిషన్లు

ఎంపీ మిథున్‌రెడ్డి తరఫున న్యాయవాదులు కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. వారానికి 5 ములాఖత్‌లు ఇవ్వాలని, ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని, వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, న్యాయాధికారి భాస్కరరావు వీటిపై విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

పోలీసులు-లాయర్ల వాగ్వాదం

మిథున్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో పోలీసులు న్యాయస్థానాల సముదాయానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన న్యాయవాదులు, మిథున్‌రెడ్డికి సంబంధించిన వ్యక్తులను, వైపీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలను మాత్రమే అనుమతించారు. బార్‌, కోర్టుకు వస్తున్న కొంతమంది న్యాయవాదులను కూడా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాషా కారును అడ్డుకోవడంతో ఆయన అక్కడే వాహనాన్ని వదిలేసి కోర్టుకు వచ్చారు. వైసీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు.. న్యాయాధికారి చాంబర్‌కు రాగానే వెళ్లి ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 03:39 AM