Share News

Minister V. Sathyakumar : అవగాహనతో క్యాన్సర్‌కు చెక్‌

ABN , Publish Date - Feb 19 , 2025 | 05:33 AM

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ)పై అవగాహన సదస్సును నిర్వహించారు.

Minister V. Sathyakumar : అవగాహనతో క్యాన్సర్‌కు చెక్‌

  • అపోహలు వీడి స్ర్కీనింగ్‌కు ముందుకు రావాలి: మంత్రి సత్యకుమార్‌

ఒంగోలు, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): సరైన అవగాహన ఉంటే ప్రాణాలు కబళించే క్యాన్సర్‌ను నివారించవచ్చని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ)పై అవగాహన సదస్సును నిర్వహించారు. మంత్రి సత్యకుమార్‌, సినీనటి గౌతమి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేపట్టిన క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపుచ్చారు. క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత సులువుగా తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. దానిపై అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, సినీనటి, లైఫ్‌ ఎగైన్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు గౌతమి సంయుక్తంగా కృషి చేస్తున్నారన్నారు. క్యాన్సర్‌ తన తల్లిని, అక్క ప్రాణాలను కబళించిందని, ముందస్తుగా గుర్తించకపోవడం వల్లే వారు మరణించారని వెల్లడించారు. ఆ సంఘటనలతో కలత చెందిన తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజున క్యాన్సర్‌పై అవగాహన, స్ర్కీనింగ్‌ పరీక్షల సర్వేపై తొలి సంతకం చేశానని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ చేసిన క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌లో 88వేల అనుమానిత కేసులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వ్యాధి బారినపడిన వారికి ఉన్నతస్థాయి వైద్యం అందిస్తామని చెప్పారు. ఏడుగుండ్లపాడులో 320 మందికి స్ర్కీనింగ్‌ చేయగా 116 అనుమానిత కేసులు వచ్చాయన్నారు.

Updated Date - Feb 19 , 2025 | 05:33 AM