Share News

Minister Savitha: వైసీపీ హయాంలో నేతన్న నేస్తంలో సగభాగం ఆ పార్టీ గూండాలకే

ABN , Publish Date - May 07 , 2025 | 06:10 AM

ఎమ్మిగనూరులో మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వైసీపీ హయాంలో నేతన్న నేస్తం పథకం నిధుల సగం చేనేతలకే కాకుండా వైసీపీ అనుచరులకు దారితీశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రావడంతో చేనేతల అభివృద్ధికి స్వర్ణయుగం వచ్చిందన్నారు

Minister Savitha: వైసీపీ హయాంలో నేతన్న నేస్తంలో సగభాగం ఆ పార్టీ గూండాలకే

  • కూటమి ప్రభుత్వం రాకతో చేనేతలకు స్వర్ణయుగం: మంత్రి సవిత

  • ఎమ్మిగనూరులో మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన

ఎమ్మిగనూరు, మే 6(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేనేతల కోసం ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకంలో 50 శాతం మాత్రమే చేనేతలకు ఇవ్వగా మిగిలిన సగాన్ని అనర్హులు, వైసీపీ గూండాలకే ఆ ప్రభుత్వం ఇచ్చిందని’ మంత్రి సవిత ఆరోపించారు. మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి వద్ద 77 ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు రాష్ట్ర మంత్రులు సవిత, టీజీ భరత్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సవిత మాట్లాడుతూ, ‘జగన్‌ తన ఐదేళ్ల కాలంలో చేనేతలకు ఏం చేశాడు? కేవలం 83వేల మందికి నేతన్న నేస్తం ఇస్తున్నట్లు చెప్పి అందులో సగం వైసీపీ గూండాలకు ఇచ్చారు.


చేనేతలకు 365 రోజులు ఉపాధి కల్పించాలని మంత్రి లోకేశ్‌ చెప్పారు. అందులో భాగంగానే మెగా టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నాం. మన రాష్ట్రానికి రూ.348 కోట్లు కేటాయించి, చేనేతల అభివృద్ధికి ప్రధాని మోదీ బాటలు వేశారు’ అని అన్నారు. జౌళి శాఖ కమిషనర్‌ రేఖారాణి, ఏపీఐసీసీ సీఈ ప్రసాద్‌, ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 06:10 AM