Share News

Minister Satyakumar: వ్యాధులపై పరిశోధనలు చేయాలి

ABN , Publish Date - Jul 03 , 2025 | 06:20 AM

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ క్రియాశీలంగా వ్యవహరించాలని, వైద్య విద్య వికాసానికి కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఆదేశించారు.

Minister Satyakumar: వ్యాధులపై పరిశోధనలు చేయాలి

  • వైద్య కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించండి

  • హెల్త్‌ వర్సిటీ అధికారులు క్రియాశీలంగా వ్యవహరించాలి

  • విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఢిల్లీ వెళ్లాలి: సత్యకుమార్‌

అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ క్రియాశీలంగా వ్యవహరించాలని, వైద్య విద్య వికాసానికి కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఆదేశించారు. 39 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పనితీరుపై బుధవారం ఆయన సమీక్షించారు. విశ్వవిద్యాలయం పనితీరు మెరుగుపడాలని, వైద్య కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. 1986లో హెల్త్‌ వర్సిటీ ఏర్పాటైందని, అప్పటి నుంచి ఇప్పటి వరకూ మంత్రి స్థాయిలో ఏ రోజూ సమీక్ష జరగలేదని అధికారులు ఆయనకు తెలిపారు. దీంతో మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ప్రాధాన్యం గల ఎన్టీఆర్‌ వర్సిటీ ప్రధాన విషయాలపై దృష్టి పెట్టకుండా సాధారణ బాధ్యతల నిర్వహణతో సాగుతోందని అన్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో విద్యాబోధన నాణ్యతను పెంచడంపై దృష్టి సారించిన దాఖలాలు లేవని, కేవలం సిలబస్‌ తయారీ, పరీక్షల నిర్వహణకు పరిమితమవ్వడం వర్సిటీ చట్ట స్ఫూర్తిని, ఆశయాలను నిర్లక్ష్యం చేసినట్టు అవుతుందన్నారు.


ఉన్నత వైద్య విద్య నాణ్యత కోసం మౌలిక సదుపాయాలు, బోధనా తీరు, వైద్యులు, విద్యార్థుల హాజరుపై పటిష్ఠ నిఘా విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. వర్సిటీ స్థాపనలో ముఖ్య ఉద్దేశమైన పరిశోధన తీరు తెన్నులపై మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలో విస్తృత స్థాయిలో ప్రభుత్వాసుపత్రులు ప్రతి రోజూ వేలాదిమందికి ఓపీ, ఐపీ సేవలు అందిస్తూ వ్యాధులకు సంబంధించి భారీ స్థాయిలో అమూల్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నా.. వ్యాధులు, ప్రాంతాల వారీగా పరిశోధనలు జరగకపోవడం, మొక్కుబడిగా పరిశోధనా ప్రాజెక్టుల్ని చేపట్టడం సబబు కాదని మంత్రి అన్నారు. ఆరోగ్య విజ్ఞాన వికాసానికి తోడ్పడే విధంగా పరిశోధనలు జరగాలని సూచించారు. సమీక్షా సమావేశంలో హెల్త్‌ వర్సిటీ వీసీ డా.పి.చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ డా.రాధికారెడ్డి, డీఎంఈ డా.నరసింహం ఇతర అధికారులు పాల్గొన్నారు.


ఢిల్లీ వెళ్లనున్న ఏపీఎంసీ

విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం ఎదురు చూస్తున్న వైద్యుల డిమాండ్‌పై సంబంధిత అధికారులతో మంత్రి మాట్లాడారు. వెంటనే ఢిల్లీ వెళ్లి వారి సమస్య పరిష్కారాల మార్గాలపై ఎన్‌ఎంసీతో చర్చించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఏపీఎంసీ చైర్మన్‌ డా.శ్రీహరిరావు, రిజిస్ట్రార్‌ డా.రమేశ్‌ త్వరలో ఢిల్లీ వెళ్లి అధికారులతో భేటీ కానున్నారు. 2021 వరకూ శాశ్వత రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికి రిజిస్ట్రేషన్‌ చేశామని, తదుపరి వచ్చిన దరఖాస్తులు మన దేశంలో చేయాల్సిన ఇంటర్న్‌షిప్‌ కాలపరిమితిపై సృష్టత కోసం పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన ప్రతి విద్యార్థి ఒకటి నుంచి రెండేళ్లు మన దేశంలో ఇంటర్న్‌షిప్‌ చేయాలని తాజాగా జాతీయ వైద్య సంఘం నిబంధన విధించిందన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 06:20 AM