Share News

Minister Nimmala Ramanaidu : నదుల అనుసంధానంతో సిరిసంపదలు

ABN , Publish Date - Feb 19 , 2025 | 05:08 AM

ప్రఖ్యాత ఇంజనీర్‌ కేఎల్‌ రావు ఏనాడో చెప్పిన నదుల అనుసంధాన ప్రక్రియకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల సమర్థ నాయకత్వంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

Minister Nimmala Ramanaidu : నదుల అనుసంధానంతో సిరిసంపదలు

  • పోలవరంతో రాష్ట్రం దశ, దిశ మారతాయ్‌: మంత్రి నిమ్మల

  • రాజస్థాన్‌లో జల మంత్రుల సదస్సు

న్యూఢిల్లీ/అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానం, నీటి వనరుల సమర్థ సద్వినియోగంతో రాష్ట్రంలో సిరిసంపదలు సృష్టించవచ్చనే ప్రగాఢ విశ్వాసంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రఖ్యాత ఇంజనీర్‌ కేఎల్‌ రావు ఏనాడో చెప్పిన నదుల అనుసంధాన ప్రక్రియకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల సమర్థ నాయకత్వంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మంగళవారం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అఖిల భారత జలవనరుల మంత్రుల రెండోసదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘కేంద్రం సహకారంతో ఆంధ్రను కరువు రహిత రాష్ట్రంగా మారుస్తాం. వినూత్న, శాస్త్రీయ విధానాలతో 2047 నాటికి జల భద్రత కల్పిస్తాం. రాష్ట్రంలోని 5 ప్రధాన నదులు, 35 చిన్న నదుల నీటిని గరిష్ఠంగా వినియోగించి రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీటిని తరలించేలా కార్యాచరణ చేపడుతున్నాం. గోదావరి-కృష్ణా, పోలవరం-ఏలేరు, కృష్ణా-పెన్నా, గోదావరి-బనకచర్ల, గోదావరి-చంపావతి, వంశధార-నాగావళి అనుసంధానం కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. నీటి నిల్వ సామర్థ్యాన్ని 480 టీఎంసీలు పెంచి.. 37 లక్షల ఎకరాలను స్థిరీకరించి, కొత్తగా 37.5 లక్షల ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం. హంద్రీ -నీవా సుజల స్రవంతిని విస్తరించడం ద్వారా సీమలో దుర్భిక్షాన్ని నివారించే చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీటి వసతి కల్పించాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా, గోదావరి డెల్టాల స్థిరీకరణ జరుగుతుంది. సుస్థిర వ్యవసాయం సాధ్యపడుతుంది.. తద్వారా రాష్ట్రం దశ, దిశ మారతాయి. మరో 85 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. భూగర్భ జలాలను కొలిచేందుకు 1,810 జియో మీటర్లు ఏర్పాటు చేశాం. దేశంలోనే తొలిసారిగా బోర్‌వెల్స్‌కు జియో ట్యాగ్‌ చేసి వినియోగిస్తున్నాం’ అని తెలిపారు. పోలవరం-బనకచర్ల అనుసంధానం, మరికొన్ని ప్రతిపాదిత ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం చేయడంతోపాటు అన్ని రకాల అనుమతులూ ఇవ్వాలని వేదికపైనే ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Feb 19 , 2025 | 05:08 AM