Share News

Minister Nimmala Ramanaidu : నిపుణుల సమ్మతి రాలేదని.. ఎందుకు చెప్పలేదు?

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:12 AM

పోలవరం డయాఫ్రం వాల్‌ పనుల విషయంలో గందరగోళం ఏమిటని తన శాఖ అధికారులపై జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Nimmala Ramanaidu : నిపుణుల సమ్మతి రాలేదని.. ఎందుకు చెప్పలేదు?

  • డయాఫ్రం వాల్‌ పనులు 2నే అన్నారుగా!

  • ఇప్పుడు 8వ తేదీ అంటున్నారేంటి?

  • జలవనరుల అధికారులపై నిమ్మల ఆగ్రహం

  • నిపుణులు స్పష్టత ఇచ్చాకే తారీఖు ఖరారుకు ఆదేశం

అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పోలవరం డయాఫ్రం వాల్‌ పనుల విషయంలో గందరగోళం ఏమిటని తన శాఖ అధికారులపై జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణంలో వాడాల్సిన ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమానికి విదేశీ నిపుణులు ఇంకా అనుమతి ఇవ్వలేదని తనకు ముందుగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. శుక్రవారం బుడమేరు విస్తరణ పనులపై సమీక్ష సందర్భంగా వాల్‌ ప్రస్తావన వచ్చింది. పనులు ప్రారంభించేందుకు జర్మన్‌ కాంట్రాక్టు సంస్థ బావర్‌ యంత్రసామగ్రిని, నిపుణులను సిద్ధం చేసిందని.. ఈ నెల రెండో తేదీనే పనులు ప్రారంభిస్తామని నెలరోజులుగా చెబుతూ వచ్చారని.. ముఖ్యమంత్రి జరిపిన సమీక్షలోనే ఇదే చెప్పారని.. ఇప్పుడు వాయిదావేయడమేంటంటూ మంత్రి మండిపడ్డారు. వాల్‌ నిర్మాణానికి వాడాల్సిన ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిక్చర్‌కు అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ ఆమోదం తీసుకోవాలని కేంద్ర జల సంఘం స్పష్టం చేసిందని ఇప్పుడు చెబితే ఎలాగని నిలదీశారు. ముందస్తు సమాచారం తనకు ఇవ్వలేదని.. వాల్‌ పనులు వాయిదా పడ్డాయని ‘ఆంధ్రజ్యోతి’లో చూశాకే ఆ విషయం తెలిసిందన్నారు. దీనిపై అధికారులు వివరణ ఇచ్చారు. రెండో తేదీన పనులు ప్రారంభించేందుకు పోలవరం ఇంజనీర్లు సిద్ధమయ్యారని, అయితే ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిక్చర్‌పై విదేశీ నిపుణులు.. డేవిడ్‌ బ్రియాన్‌ పాల్‌, జియాన్‌ ఫ్రాంకో డి సిక్కో (అమెరికా), సీన్‌ హించ్‌బెర్గర్‌, చార్లెస్‌ రిచర్డ్‌ డొనెల్లీ(కెనడా)తో కూడిన బృందం ఆమోదం పొందాల్సిందేనని జల సంఘం స్పష్టం చేసిందని తెలిపారు.


అప్పటికప్పుడు ఆ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు ఇంజనీర్లు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు ప్రయత్నించారని.. క్రిస్మస్‌ వేడుకల్లో మునిగి ఉన్న వారు అందుబాటులోకి రాలేదన్నారు. ఈ నెల 7-10 తేదీ మధ్య వారు అందుబాటులోకి రాగానే.. కాంక్రీట్‌ మిక్చర్‌పై స్పష్టత తీసుకుంటామని పీపీఏ తెలిపిందన్నారు. 8వ తేదీ నుంచి పనులు చేపట్టేలా ఒప్పిస్తామని కూడా చెప్పిందని తెలియజేశారు. దీంతో నిమ్మల మరింత అసహనానికి గురయ్యారు. డయాఫ్రం వాల్‌ పనులపై అంతర్జాతీయ నిపుణులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాకే తేదీని ఖరారు చేయాలని తేల్చిచెప్పారు. కాగా.. కాంక్రీట్‌ మిక్చర్‌పై నిపుణుల అనుమతి రాలేదన్న సమాచారం ప్రభుత్వం దృష్టికి ప్రాజెక్టు ఇంజనీర్లు తీసుకురాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ముందే మంత్రికి చెబితే.. సీఎం దృష్టికి తీసుకెళ్లేవారని.. ఆయన కేంద్ర జలశక్తి శాఖతో మాట్లాడితే.. ఈసరికి స్పష్టత వచ్చేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

Updated Date - Jan 04 , 2025 | 05:12 AM