Dhanurmasa Celebrations : ధనుర్మాస ఉత్సవాల్లో మంత్రి లోకేశ్
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:12 AM
శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన ధనుర్మాసంలో దీక్షలు ఆచరించడం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ఆశీర్వచనాలు అందజేసిన చినజీయర్ స్వామి
మంగళగిరి సిటీ, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన ధనుర్మాసంలో దీక్షలు ఆచరించడం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి శ్రీశైల నగర్‌లోని బాపూజీ విద్యాలయంలో చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో మంత్రి మంగళవారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మంత్రి లోకేశ్‌కు ఆశీర్వచనాలు అందజేసి కొద్దిసేపు ఆధ్యాత్మిక అంశాలపై చర్చించారు. ధనుర్మాస ఉత్సవాలకు హాజరై శ్రీవారి అనుగ్రహం పొందడం సంతోషంగా వుందని ఈ సందర్భంగా లోకేశ్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతలో ధార్మిక, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందన్నారు. మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రం, విజయకీలాద్రి క్షేత్రాలను ధనుర్మాసంలో దర్శించుకోవడం ద్వారా మంచి జరుగుతుందన్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైనా ఉండాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.