Share News

YSRCP: మీరా రైతుల గురించి మాట్లాడేది

ABN , Publish Date - May 05 , 2025 | 05:37 AM

పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రైతుల సంక్షేమం కోసం చేసిన ప్రభుత్వ చర్యలను వివరించారు. రైతులకు ఔత్సాహికంగా మద్దతు ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వ పనితీరును, మాజీ సీఎం జగన్‌ ఆరోపించిన విధంగా అవమానకరంగా మాట్లాడటం అప్రతిష్టా అని పేర్కొన్నారు.

YSRCP: మీరా రైతుల గురించి మాట్లాడేది

వైసీపీ ప్రభుత్వంలో ఏనాడైనా రైతులను ఆదుకున్నారా?

వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు జగన్‌

మంత్రి మనోహర్‌ ధ్వజం

కాకినాడ, మే 4(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ హయాంలో నరకం చూసిన రైతులు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆనందంగా జీవిస్తున్నారు. ఓర్వలేని మాజీ సీఎం జగన్‌ సడన్‌గా నిద్రలోంచి లేచి.. అన్నం పెట్టిన రైతుకు ప్రభుత్వం సున్నం కొట్టిందంటూ అవమానకరంగా మాట్లాడడం బాధాకరం’ అని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఆదివారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంటూ.. వర్క్‌ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న జగన్‌ మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.1,674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు పెట్టిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే ఆ బకాయిలు చెల్లించిందని పేర్కొన్నారు. మిల్లర్లకు రూ.400 కోట్ల బకాయిలు చెల్లించలేదని, పౌరసరఫరాల శాఖలో రూ.41 వేల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. వీళ్లా రైతుల సంక్షేమం గురించి మాట్లాడేది? అని మంత్రి మనోహర్‌ దుయ్యబట్టారు.


ముందు వాస్తవాలు తెలుసుకోండి

తమ ప్రభుత్వం ఖరీఫ్‌, రబీల్లో 48.34 లక్షల టన్నుల ఽధాన్యాన్ని కొనుగోలు చేసిందని, రూ.11 వేల కోట్ల సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశామన్న విషయాన్ని జగన్‌ తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు. ఇంకా 10 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిపై సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన సీమ జిల్లాల అధికారులతో సమావేశం కానున్నట్టు వెల్లడించారు. రోమ్‌ చక్రవర్తి ఇంట్లో కూర్చుని ఫిడేల్‌ వాయించినట్లుగా జగన్‌ తన ప్యాలె్‌సలో కూర్చుని అకాల వర్షాలు, తుఫాన్ల సమయంలో రైతులను అవమానించేలా మాట్లాడారే తప్ప, ఎక్కడ రైతులను ఆదుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మిల్లులకు ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతును రేండమైజేషన్‌ పద్ధతి పెట్టి.. సాఫ్ట్‌వేర్‌లో మోసం చేసి వారికి నచ్చిన మిల్లుకే దారిమళ్లించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రేటు, మిల్లులు వారే నిర్ణయించుకుని డబ్బులు మాత్రం రైతుల ఖాతాల్లో వేసేవారు కాదని, వారి కుంభకోణాలకు మాత్రమే రైతులను వినియోగించుకున్నారని విమర్శించారు.


మిల్లర్లు రైతులకు అండగా నిలవాలి

మొదటిసారి రైసుమిల్లర్లకు బ్యాంకు గ్యారంటీల విషయంలో డబ్బులు సరిపోవడం లేదంటే 1:2 నిష్పత్తిలో వెసులుబాటు కల్పించామని మంత్రి మనోహర్‌ పేర్కొన్నారు. రైసుమిల్లర్లు ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా నిలవాలని, ఆ బాధ్యత ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇచ్చే గోతాలను రైతులకు ఇవ్వకుండా మిల్లర్లు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. మిల్లర్లకు ప్రభుత్వం బకాయిలు చెల్లించి అండగా నిలిచిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయగానే సీఎంఆర్‌ ద్వారా డబ్బులు చెల్లిస్తామన్న మాటను నిలుపుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలుకు నిర్ణయించిన టార్గెట్లను పెంచుతామని తెలిపారు. మీడియా సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోట సుధీర్‌, కౌడా చైర్మన్‌ తుమ్మల రామస్వామి తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 05:37 AM