AP Government Mining Reforms: గనుల ఆదాయం పెంచుదాం
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:21 AM
జగన్ సర్కారు సూక్ష్మ ఖనిజాల పాలసీలో కీలక మార్పులు చేసింది. లీజు కాలపరిమితులు పెంచి, ఫీజుల భారం తగ్గించి, సీనరేజీ కాంట్రాక్ట్ అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది
మినరల్ పాలసీలో సర్కారు కీలక మార్పులు
పెండింగ్ దరఖాస్తులకు వన్‌టైమ్ సెటిల్ మెంట్
తగ్గనున్న ఫీజుల భారం.. పెరగనున్న లీజు కాలం
గ్రానైట్ లీజు కాలపరిమితి 20 నుంచి 30 ఏళ్లకు
రోడ్ మెటల్ లీజు 15 నుంచి 30 ఏళ్లకు పెంపు
ఇకపై అన్ని జిల్లాల్లో సీనరేజీ కాంట్రాక్ట్ అమలు
జగన్ సర్కారు పాలసీలో సమూల మార్పులు
అమరావతి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): గనులు, ఖనిజాల తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పురోగమనంలో గనుల పాత్ర కీలకంగా ఉండేలా, ఈ రంగంలో పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా జగన్ సర్కారు 2020లో తీసుకొచ్చిన సూక్ష్మఖనిజాల పాలసీలో సమూల మార్పులు చేసింది. ఈ మేరకు కొత్తగా సూక్ష్మ ఖనిజాల పాలసీ-2025ని విడుదల చేస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో 57) జారీ చేశారు. దీనికి నూతన పాలసీ డాక్యుమెంట్‌ను జతచేసి తగిన చర్యలు తీసుకోవాలని గనుల శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.
పాలసీలోని ముఖ్యాంశాలు..
వన్‌టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్
జగన్ హయాంలో 2022 నాటికి పెండింగ్‌లో ఉన్న లీజు వివాదాలను పరిష్కరించేందుకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నూతన పాలసీలో పొందుపరిచింది. ఆనాటి దరఖాస్తుదారులకు ఎవరు ముందు వస్తే వారికే అవకాశం (ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్) ప్రాతిపదికన అమలు చేయనున్నారు. దరఖాస్తుదారులకు ఒక సంవత్సరానికి మాత్రమే లెటర్ ఆఫ్ ఇండెంట్ (ఎల్‌ఓఐ) ఇవ్వనున్నారు. ఎల్‌ఓఐ అందని వారికి అనర్హులుగా భావించాల్సి ఉంటుంది. ఎల్‌ఓఐ ఇచ్చే సమయంలో 3 రెట్ల వార్షిక డెడ్‌రెంట్ (ఏడీఆర్), క్వారీ లీజులు ఇచ్చే సమయంలో మరో రెండు రెట్ల ఏడీఆర్‌ను ప్రీమియం రూపంలో చెల్లించాలి. నిజానికి జగన్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయం కారణంగా 6 వేల దరఖాస్తులు అనర్హతకు గురయ్యాయి.
ఇక సులభంగా లీజులు..
జగన్ సర్కారు తీసుకొచ్చిన పాలసీ అన్ని లీజులను వేలం విధానానికి మళ్లించింది. దీనివల్ల పెత్తందారులు, ఆర్థికంగా బలాన్ని ప్రదర్శించిన వారికే కీలక లీజులు దక్కాయి. ఇప్పుడు ఈ విధానాన్ని ప్రభుత్వం మార్చివేసింది. కొత్తగా దరఖాస్తు విధానంలో లీజులు ఇవ్వనుంది. పట్టా, డీకేటీ, అటవీ భూముల్లో మైనర్ మినరల్స్‌కు దరఖాస్తు పద్ధతిలోనే లీజులు మంజూరు చేయనుంది. నివాసాలు, నీటిపారుదల రంగం, మౌలిక వసతుల ప్రాజెక్టుల అవసరాలను తీర్చేందుకు గ్రానైట్, బిల్డింగ్ మెటీరియల్స్ (రోడ్‌మెంట్, గ్రావెల్, బిల్డింగ్‌స్టోన్స్) వంటి వాటిని దరఖాస్తు పద్ధతిలో మంజూరు చేస్తారు. సిలికాశాండ్, క్వార్ట్జ్, డోలమైట్ వంటి పారిశ్రామిక ఖనిజాలు ప్రీమియంతో వేలం ద్వారా మంజూరు చేస్తారు. ఇందులో వన్‌టైమ్ ప్రీమియం బదులు సీనరేజీ ఫీజు శాతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సీనరేజీ కలెక్షన్ కాంట్రాక్ట్
ప్రస్తుతం ఏడు ఉమ్మడి జిల్లాల్లోనే సీన రేజీ కాంట్రాక్ట్ అమల్లో ఉంది. ఇకపై రాష్ట్రమంతా దీన్ని అమలు చేయనున్నారు. దీనివల్ల స్థిరమైన ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంటే, ఇకపై అన్ని జిల్లాల్లో సీనరేజీ కాంట్రాక్ట్ అమలు కానుంది. ఫీజుల వసూళ్లలో గనులశాఖ అధికారుల పెత్తనం ఉండదన్నమాట. ప్రభుత్వం తాజాగా సీనరేజీ కాంట్రాక్ట్ కాలపరిమితిని 73 రోజుల మేర పొడిగింపు ఇచ్చింది. ఈ కాంట్రాక్ట్ కాలపరిమితి ముగిశాక ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 13 జిల్లాలకు టెండర్లు నిర్వహించి కాంట్రాక్ట్ సంస్థలను ఎంపిక చేయనుంది.
ఆర్థిక భారం ఉండదు..
జగన్ ప్రభుత్వం కరోనా కాలంలో గనులపై ఇబ్బడిముబ్బడిగా ఫీజుల భారం వేసింది. పెండింగ్ దరఖాస్తులు, కొత్త ప్రాంతాలు, రెన్యువల్స్‌పై లీజులు మంజూరు చేసేందుకు ఫీజుల భారం ఎక్కువగా ఉంది. కొత్త పాలసీ ద్వారా ఫీజుల భారం తగ్గనుంది. 10 రెట్లుగా ఉన్న డెడ్‌రెంట్‌ను ఐదు రెట్లకు తగ్గించారు. ఈ మొత్తాన్ని 2-3 ఏళ్లలో రెండు సులభతర వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల లీజుదారులపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. లైమ్‌స్టోన్ శ్లాబ్స్ కోసం ప్రీమియం మొత్తం 3 రెట్ల డెడ్‌రెంట్‌కు తగ్గించారు. డెడ్‌రెంట్‌ను ఇకపై వార్షికంగా ఫైనల్ చేయనున్నారు. రెన్యువల్స్‌కు సంబంధించి ప్రీమియం 1-2 రెట్ల వార్షిక డెడ్‌రెంట్ నుంచి 5 రెట్లకు తగ్గించారు. డెడ్‌రెంట్లను కూడా ఖనిజాల ప్రాతిపదికన సవరించారు. మొత్తంగా డెడ్‌రెంట్లను ప్రీమియం రూపంలో పరిగణించి వసూలు చేస్తారు. దీనివల్ల కొత్తగా ఎలాంటి అదనపు భారం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. తప్పులు జరిగినప్పుడు లీజుదారులపై విధించే జరిమానాలను 10 రెట్ల నుంచి 2 రెట్లు, ఐదు రెట్ల నుంచి ఒక రెట్టుకు ప్రభుత్వం తగ్గించింది. అలాగే గనుల ముందస్తు అనుమతుల కోసం లీజుదారులు రోజుల తరబడి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఏకీకృత విధానంలో పర్మిషన్‌లు ఇచ్చేలా ఇంటర్ డిపార్ట్‌మెంట్‌ల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. లీజుదారులు లీజును బదిలీ చేయాలనుకుంటే ఇప్పుటి వరకు భారీగా ఫీజులు చెల్లించాలి. కొత్త పాలసీలో దీన్ని రద్దు చేశారు. కుటుంబ సభ్యుల పేరిట లీజు బదిలీపై వసూలు చేసే ఫీజును పూర్తిగా మాఫీ చేశారు.
పెరిగిన లీజు కాలం..
గతంతో పోలిస్తే సూక్ష్మ ఖనిజాల మైనింగ్ లీజుల కాలపరిమితిని భారీగా పెంచారు. కొత్తగా మంజూరయ్యే గ్రానైట్ లీజు కాలపరిమితిని 20 నుంచి 30 ఏళ్లకు, రోడ్‌మెటల్ యూనిట్ లీజు కాలపరిమితిని 15 నుంచి 30 ఏళ్లకు, మిగిలిన ఖనిజాల లీజు కాలపరిమితిని 5 నుంచి 10ఏళ్లకు పెంచారు. కొవిడ్ ఖర్చుల నిమిత్తం 2021లో విధించిన కన్సిడరేషన్ అమౌంట్‌ను పూర్తిగా రద్దుచేసింది. కొత్త పాలసీలో టన్నేజ్ ఆధారిత సీనరేజ్ ఫీజు విధానం అమలవుతుందని తెలిపింది.