Deputy CM Pawan Kalyan : మినీ గోకులాలకు జై!
ABN , Publish Date - Jan 25 , 2025 | 06:17 AM
పాడి ఉన్న రైతులకు వీటిని మంజూరు చేయడం ద్వారా పాల ఉత్పత్తి పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

నిర్మాణాలపై పాడిరైతుల ఆసక్తి.. ఉపాధి నిధులతో 23 వేలకు పైగా షెడ్లు
మరో 20 వేలకు పైగా మంజూరుకు నిర్ణయం
90 శాతం సబ్సిడీతో..
హౌసింగ్ ఇళ్లకంటే మెరుగైన ప్రయోజనం
పేద పాడిరైతులకు ఊరటనిస్తున్న పశు ఆవాసాలు
పాల ఉత్పత్తి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పాడిరైతుల ప్రయోజనార్థం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సరికొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అవే మినీ గోకులాలు. పాడి ఉన్న రైతులకు వీటిని మంజూరు చేయడం ద్వారా పాల ఉత్పత్తి పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. 90 శాతం ఉపాధి మెటీరియల్ నిధులతో ఒక్కో షెడ్ నిర్మాణానికి గరిష్ఠంగా రూ.2.30 లక్షలను మంజూరు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మినీ గోకులాలు నిర్మించేందుకు పాడి రైతులు విపరీతంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒక్క నెలలోనే సుమారు 23 వేల షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో ఈ పథకానికి విపరీతమైన ఆదరణ లభించింది. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టినప్పటికీ అప్పట్లో రైతులు పరిమితంగా షెడ్లు నిర్మించుకున్నారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి బిల్లులు నిలిపేసి రైతులను ఇబ్బంది పెట్టడంతో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత రైతులకు బిల్లులు చెల్లించారు.
ఒక్కో షెడ్‌కు రూ.2.30 లక్షల వరకు..
ఉపాధి హామీ పథకంలో పశువుల షెడ్లను నిర్మించేందుకు అనుమతి ఉండటంతో ప్రభుత్వం ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల షెడ్లు నిర్మాణాలకు అన్ని జిల్లాల కలెక్టర్లు పరిపాలన ఆమోదం ఇచ్చారు. రెండు పశువులు కలిగిన పాడి రైతులకు రూ.1.15 లక్షలు, నాలుగు పశువులు కలిగిన వారికి రూ.1.85 లక్షలు, 6 పశువులు కలిగిన వారికి రూ.2.30 లక్షల ఉపాధి మెటీరియల్ నిధులు మంజూరుచేశారు. పశువులతో పాటు 20 మేకలకు షెడ్లు వేసుకునే వారికి రూ.1.30 లక్షలు, 50 మేకలు కలిగిన వారికి రూ.2.30 లక్షలు అందించనున్నారు. అదే విధంగా కోళ్ల ఫారాలకు.. 100 కోళ్లు పెట్టుకున్న వారికి షెడ్డు నిర్మాణానికి రూ.87 వేలు, 200 కోళ్లు పెంచుకునే వారికి రూ.1.32 లక్షలు మంజూరుచేశారు. ఇందులో 10 శాతం రైతులు భరిస్తే, మిగిలిన 90 శాతం ఉపాధి మెటీరియల్ నిధుల నుంచి అందిస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 10 శాతం రైతులు డిపాజిట్ చేస్తేనే పనులు మంజూరు చేసేవారు. అయితే ఈ దఫా ముందుగా పనులు మంజూరుచేసి, రైతులు చెల్లించాల్సిన 10 శాతం వాటా నిర్మాణ ఖర్చులకు వాడుకునేలా వారికే వెసులుబాటు కల్పించారు. ఇందులో కూలీలు చేసే పనులకు ఉపాధి మార్గదర్శకాల ప్రకారం మస్టర్లు నమోదు చేస్తారు.
బిల్లులు ఆలస్యం చేయకుండా..
పేద కుటుంబాలు ఇళ్లు నిర్మించుకోవాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.1.80 లక్షలే అందిస్తున్నాయి. అయితే ఆరు పశువులు కలిగిన పాడి రైతులకు పశువుల షెడ్ మినీగోకులం నిర్మించేందుకు ఉపాధి హామీ పథకం రూ.2.30 లక్షలు అందిస్తుండడం విశేషం. పైగా వాటి నిర్మాణాలకు బిల్లులు ఆలస్యం చేయకుండా ప్రతి గురువారం గ్రామీణాభివృద్ధిశాఖ చెల్లింపులు చేపడుతోంది. రైతులు తమకు నచ్చిన రీతిలో వారి స్థల అనుకూలతను బట్టి సొంత నిధులతో మరింత పెద్ద షెడ్లను నిర్మించుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
పశుగ్రాసం సాగుకూ మెటీరియల్ నిధులు
రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణం కలిగిన చిన్న కమతాలే ఎక్కువ. ఈ కమతాల్లో వ్యవసాయం లాభసాటిగా లేదు. దీంతో గ్రామాల్లో ఇలాంటి రైతులు ఎక్కువగా పాడిని నమ్ముకుంటున్నారు. అయితే ఈ పాల ఉత్పత్తి, ఆదాయం కూడా అంతంత మాత్రమే. ఈ నేపఽథ్యంలో మినీ గోకులాలు ఊరటనిస్తున్నాయి. పాడి పశువులను ఎండా వానల్లో కాకుండా షెడ్లలో ఉంచి పెంచడం ద్వారా మరింత పాల ఉత్పత్తి పెరిగే అవకాశం పశుసంవర్థక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు పశుగ్రాసం కోసం మెటీరియల్ నిధులు మంజూరు చేస్తున్నారు. 10 సెంట్ల నుంచి 50 సెంట్ల దాకా సొంత పొలం ఉన్న పాడి రైతులకు మేత పెంచుకునేందుకు ఉపాధి మెటీరియల్ నిధులు మంజూరు చేస్తారు. ఒక్కో రైతు మేత పెంచుకునేందుకు రూ.30 వేల నుంచి 1.30 లక్షల దాకా ఉపాధి నిధులు పొందవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..
Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..
Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట
Read Latest AP News and Telugu News