Mining: ‘గనుల్లో’ 1,300 కోట్లు గాయబ్
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:35 AM
ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం తీసుకొచ్చే గనుల శాఖ చతికిలపడింది. ఆదాయ లక్ష్యాలను అందుకోవడంలో దిశ, దశ లేకపోవడం, సకాలంలో కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఆదాయం భారీగా పడిపోయింది.

సర్కారుకు అడుగడుగునా చిల్లే.. రాష్ట్ర గనుల శాఖ నిర్వాకం
సీనరేజీ కాంట్రాక్టులపై నిర్లిప్తత.. ఇందులోనే 800 కోట్ల బకాయిలు
లీజులు, పర్మిట్లలో ప్రైవేటు జోక్యం.. గడువు దాటినా రాని బకాయిలు
కొత్త కాంట్రాక్టుల ఊసేలేదు.. ఎవరికి వారే సొంత వసూళ్లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం తీసుకొచ్చే గనుల శాఖ చతికిలపడింది. ఆదాయ లక్ష్యాలను అందుకోవడంలో దిశ, దశ లేకపోవడం, సకాలంలో కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఆదాయం భారీగా పడిపోయింది. ఏకంగా 2024-25 సంవత్సరానికి రూ.1,300కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. సీనరేజీ కలెక్షన్ కాంట్రాక్ట్‌ను(ఎ్‌ససీసీ) సమర్థంగా కొనసాగించలేకపోవడం, అన్ని జిల్లాలకు విస్తరించకపోవడంతో మైనర్ మినరల్స్‌పై ఆదాయం పడిపోయింది. సీఎం చంద్రబాబు వద్ద ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు జరిగినా, చర్చోపచర్చలు, పరిశీలనలు జరిపినా పలు కీలకమైన అంశాల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా ఇప్పటికీ సీనరేజీ కలెక్షన్ కాంట్రాక్ట్ బ్రహ్మపదార్థంగానే ఉంది. గత ప్రభుత్వంలో ఏడు ఉమ్మడి జిల్లాలకు ఇచ్చిన కాంట్రాక్ట్ కాలపరిమితి గతేడాదే ముగిసింది. కాంట్రాక్ట్ కొనసాగింపు కోసం కంపెనీలు బకాయిలు చెల్లించలేదు. మరోవైపు లీజుదారుల నుంచి సీనరేజీ సహా అనేక రకాల ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నాయి. ఆ కాంట్రాక్ట్ పొడిగించాలా? లేక కొత్తగా టెండర్లు పిలవాలా? అన్నదానిపై ప్రభుత్వం నెలల తరబడి పరిశీలనలు, పరిశోధనలు జరుపుతోన్నా నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీంతోపాటు, మిగిలిన జిల్లాల కాంట్రాక్టు కూడా తేల్చలేకపోతున్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు, వారి సంస్థలు దర్జాగా సీనరేజీ వసూళ్లకు దిగారు. ఇంత జరుగుతున్నా ఏ అంశంపైనా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇది ప్రైవేటు కంపెనీలు, వాటివెనక ఉన్న వ్యక్తులకు కనకవర్షం కురిపిస్తోంది.
సీనరేజీలోనే రూ.800 కోట్ల బకాయి
గనులశాఖ ఇటీవల సీఎంకు 3 రకాల నివేదికలు ఇచ్చింది. ఆదాయార్జన శాఖలపై జరిగిన సమావేశంలో ఒకటి, తర్వాత గనులశాఖపై ప్రత్యేకంగా జరిగిన సమీక్షలో రెండు రిపోర్టుల ద్వారా ఆదాయ వ్యయాల గణాంకాలను సీఎం ముందు పెట్టింది. 2023-24కు గనులశాఖ ఆదాయ టార్గెట్ 4,000 కోట్లు. 2024-25కు 4,500 కోట్లు. ఇవి జగన్ ప్రభుత్వంలో రూపొందించిన గణాంకాలు. 2023-24లో వైసీపీ నేతలు ఖనిజాల దోపిడికి పాల్పడినా, గనుల ఆదాయం సర్కారుకు చేరింది. ఇసుకపై చూపించిన ఆదాయం స్వల్పంగానే ఉన్నా మిగతా ఆదాయం ఎక్కువగా మైనర్ మినరల్స్ ద్వారానే వచ్చినట్లు పేర్కొన్నారు. 2024-25లో 4,500 కోట్లు ఆదాయం టార్గెట్. దీన్ని ఇప్పుడు గనులశాఖ 3,500 కోట్లుగానే చూపించింది. ఇదే పెద్ద మాయ. పోనీ, చూపించిన మేర ఆదాయం సంపాదించిందా?...అంటే లేనేలేదు. కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, విజయనగరం, కడప, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల పరిధిలో సీనరేజీ కలెక్షన్ కాంట్రాక్ట్ అమల్లోఉంది. దీని విలువ 1,748 కోట్లు. అధికారిక లెక్కలప్రకారం, 800 కోట్ల మేర కాంట్రాక్ట్ సంస్థలు బకాయులు చెల్లించాలి. కూటమి ప్రభుత్వం కొలువుతీరిన కొత్తలో కాంట్రాక్ట్‌లను రద్దుచేయాలనుకున్నా తర్వాత వాటినే కొనసాగించారు. కాలపరిమితి ముగిసినా కంపెనీల నుంచి బకాయిలు వసూలు చేయలేదు. అలాగని, కాంట్రాక్ట్‌ను నిలపుదల చేయలేదు. కాగా, మార్చి నెలాఖరు నాటికి అన్ని బకాయిలు కలిపి రూ.1,300కోట్లు వసూలు చేస్తామని గనులశాఖ ముఖ్యమంత్రికి జనవరిలో హామీ ఇచ్చింది. ఈ నెల 4న సీఎం వద్ద జరిగిన సమావేశంలో తేలిన దాని ప్రకారం, ఒక్క రూపాయి కూడా వసూలు కాలేదు. అప్పుడే మార్చి మొదటివారం ముగిసిపోతోంది. మరో మూడు వారాల్లో ఆర్థిక సంవత్సరమే ముగియనుంది. గత తొమ్మిది నెలల్లో సాధ్యంకాని బకాయిల వసూళ్లు మరో మూడు వారాల్లో చేయగలరా? అన్నది అతిపెద్ద ప్రశ్న. కీలకమైన ఆదాయం తీసుకొచ్చే విషయంలోనే సకాలంలో నిర్ణయాలు తీసుకోలేకపోవడం ప్రభుత్వానికి తీవ్ర ఆర్థికనష్టం చేకూర్చిందని మైనింగ్ నిపుణులు చెబుతున్నారు.
ఆరు జిల్లాల్లో 300 కోట్లు లోటు?
గనులశాఖ నియంత్రణలోని ఆరు జిల్లాల్లో వసూలు కావాల్సిన సీనరేజీ టార్గెట్‌లోనూ 300 కోట్ల మేర లోటు కనిపించినట్లు తెలిసింది. ప్రభుత్వం మారిన తర్వాత కొందరు నేతలు, ప్రైవేటు వ్యక్తులు ఆ జిల్లాల్లో సీనరేజీ వసూళ్లపై పెత్తనం చెలాయించడం వల్లే ఈ సమస్య ఏర్పడినట్లు తెలిసింది. పాత కాంట్రాక్టులున్న జిల్లాల్లో ఇప్పటికీ కొందరు నేతలు, ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్‌గా అనధికారికంగా సీనరేజీ వసూలు చేస్తున్నట్లుగా ఫిర్యాదులున్నాయి. దీనిపై గనుల శాఖకు నియంత్రణ లేనట్లుగా ఉంది.
సిలికా, క్వార్ట్జ్‌లో 200 కోట్లు పాయె..
కూటమి ప్రభుత్వం వచ్చాక సిలికా శాండ్, క్వార్ట్జ్‌లో అక్రమాల పేరిట సుదీర్ఘకాలం అనధికారికంగా పర్మిట్లు నిలిచిపోయాయి. ఈ పరిణామాన్ని కొందరు నేతలు, అధికారులు సొమ్ముచేసుకున్నారు. ఫలితంగా 200 కోట్లమేర సర్కారుకు నష్టం జరిగినట్లు ప్రాఽథమిక అంచనా. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోతోందని, వెంటనే పర్మిట్లు ఇవ్వాలని ఆదేశించినా గనుల శాఖ జూనియర్ అధికారి సకాలంలో నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఆయనపై చర్యలకు ప్రభుత్వం కదిలితే కూటమి పెద్దలే ఆయనను కాపాడేందుకు పైరవీలు చేశారు. దీంతో ఆ అధికారి సేఫ్. కానీ, ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం మాత్రం వెనక్కి రాలేదు. ఇలా పలుకీలకమైన అంశాల్లో సర్కారు స్థాయిలో విధాన నిర్ణయాలు తీసుకోలేదు. ఫలితంగా బకాయిలు ఖజానాకు చేరకపోగా, కొత్తగా రావాల్సిన ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోంది. ఈ విషయంలో సమయానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సీనియర్ అధికారులు సూచిస్తున్నారు.