Rajeev Kumar: బిల్ గేట్స్, స్టీవ్ బామర్, సత్య నాదెళ్ల వంటి వారితో పనిచేశా: రాజీవ్ కుమార్
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:43 PM
బిల్ గేట్స్, స్టీవ్ బామర్, సత్య నాదెళ్ల వంటి ప్రముఖ సీఈవోలతో కలిసి పని చేశానని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఆర్థికాభివృద్ధి, జీడీపీ వృద్ధిలో కృత్తిమ మేథ కీలకంగా ఉంటోందని చెప్పుకొచ్చారు. కంప్యూటర్ల రాకతో మూడో పారిశ్రామిక విప్లవం మొదలైందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 24: మన జీవితంలో టెక్నాలజీ ప్రతి నిమిషం భాగమైందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ అన్నారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మాట్లాడారు. ముప్పై ఏళ్లకు పైగా మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్నానని తెలిపారు. బిల్ గేట్స్, స్టీవ్ బామర్, సత్య నాదెళ్ల వంటి ప్రముఖ సీఈవోలతో కలిసి పని చేశానన్నారు. ఆర్థికాభివృద్ధి, జీడీపీ వృద్ధిలో కృత్తిమ మేథ కీలకంగా ఉంటోందని చెప్పుకొచ్చారు. కంప్యూటర్ల రాకతో మూడో పారిశ్రామిక విప్లవం మొదలైందని అన్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని పేర్కొన్నారు. జనరేటివ్ ఏఐతో సాంకేతికతలో సమూల మార్పులు వచ్చాయన్నారు.
మనిషిని అర్థం చేసుకుని సాఫ్ట్ వేర్ పని చేయటం ఏఐ ప్రత్యేకతని రాజీవ్ తెలిపారు. కృత్తిమ మేథ ఎవరిని రీప్లేస్ చేయలేదని.. కానీ ఎవరికైనా సహాయకారిగా ఉంటుందని తెలిపారు. తన ఉద్యోగం అంతా మెక్రోసాప్ట్ లోనే కొనసాగిందని చెప్పుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ తోపాటు మరో సంస్థలో ఎక్కువ జీతం ఆఫర్ వచ్చినా వెళ్లలేదని అన్నారు. ఇంటర్వ్యూ సమయంలో మైక్రోసాఫ్ట్ వాళ్లు అడిగిన ప్రశ్నల్లో నిజాయతీ తనకు నచ్చిందని గుర్తు చేశారు. కష్టపడి పని చేయటం మైక్రోసాఫ్ట్ లో నేర్చుకున్నానన్నారు. బిల్ గేట్స్ నుంచి మూడు కీలక విషయాలు నేర్చుకున్నానని.. సరైన నిర్ణయం తీసుకోవడం, దీర్ఘకాలిక లక్ష్యాలు ఎంచుకోవటం, సవాళ్లను స్వీకరించటం ఇవే విజయానికి కారణాలుగా పేర్కొన్నారు.
సత్య నాదెళ్ల చెప్పటం వల్లే తాను అమెరికా నుంచి ఇండియాకి వచ్చానని వివరించారు. అందరూ అమెరికా వెళ్తుంటే తాను ఆ సమయంలో ఇండియాలో పని చేయటానికి వచ్చానన్నారు. ఏ విషయమైనా అర్థమయ్యేలా చెప్పటం, నిరంతరం నేర్చుకోవటం, ప్రతి విషయంలో స్పష్టత సత్య నుంచి నేర్చుకున్నానన్నారు. వృత్తిని, జీవితాన్ని సమన్వయం చేసుకోవటం చాలా ముఖ్యమని చెప్పారు. జీవితంలో ఏ వయసులో ఏం కావాలనే స్పష్టత చాలా ముఖ్యమని.. అపజయం పాలైనప్పుడు చేతులెత్తేయటం కాకుండా మళ్లీమళ్లీ ప్రయత్నించి గెలవడం ముఖ్యమని అక్కడి వారిలో స్ఫూర్తిని నింపారు. దేనికి భయపడకుండా ముందుకెళ్లాలని.. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. ఇందుకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Kurnool Bus Incident: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం.. బైకర్ తల్లి చెప్పిన విషయాలివే..
Kurnool: కర్నూలు జిల్లాలో ప్రమాదం.. క్షతగాత్రుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచి..