Kurnool: కర్నూలు జిల్లాలో ప్రమాదం.. క్షతగాత్రుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచి..
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:22 PM
కర్నూల్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని దగ్ధం కావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అయితే, ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ కొందరు ప్రయాణికులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించిన ఓ స్థానికుడు తన మానవత్వం చాటుకున్నాడు.
కర్నూలు: జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి దగ్ధం కావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలానికి దారి తీసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొనడంతో చెలరేగిన మంటలు పలువురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో మెుత్తం 39మంది ప్రయాణికులు ఉన్నారు. మంటల్లో చిక్కుకుని 19మంది సజీవ దహనం కాగా.. మిగతా ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అద్దాలు పగలగొట్టి బస్సు నుంచి బయటపడిన కొందరు ప్రాణాలను దక్కించుకున్నారు. ప్రయాణికుల్లో కొందరిని నవీన్ అనే వ్యక్తి తన కారులో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. క్షతగాత్రుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచారు. ఆ సమయంలో ఏం జరిగిందనే విషయాలను ఆయన మీడియాకు తెలిపారు (Kurnool Accident).
హిందూపూర్ నుంచి నంద్యాలకు తాను వెళుతుండగా ఘటనా స్థలంలో బస్సు మంటల్లో దగ్ధమవుతూ కనిపించిందని నవీన్ చెప్పారు. బస్సులో నుంచి బయటపడ్డ ఆరుగురిని తన కారులో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిపారు. బస్సు చుట్టూరా మంటలు వ్యాపించాయని, వాహనాన్ని సమీపించే అవకాశమే లేకుండా పోయిందని వాపోయారు. రమేశ్ అనే ఓ ప్యాసెంజర్ బస్సు అద్దం పగలగొట్టుకుని బయటకు వచ్చినట్టు అతడు తెలిపారు. అది మనిషి పట్టేంత వెడల్పు కూడా లేకపోవడంతో కొందరికి గాజు గుచ్చుకుని గాయాలయ్యాయని వెల్లడించారు. ఆరుగురు క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ఇక పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న హైమా రెడ్డి.. బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి పోలీసులు సమాచారం అందించారు.
బస్సును బైక్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టూ వీలర్ నడుపుతున్న వ్యక్తి పక్కకు పడిపోగా బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఈ క్రమంలో పెట్రోల్ లీక్ కావడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు బస్సును దగ్ధం చేశాయి. బస్సు డ్రైవర్లలో ఒకరు పరారవ్వగా.. మరొకరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
బాలయ్య పేరు ఎత్తే అర్హత నీకుందా?.. జగన్‌పై నుడా చైర్మన్ ఫైర్
మద్యం కుంభకోణం కేసులో నిందితులకు దక్కని ఊరట
Read Latest AP News And Telugu News