Share News

Amaravati: నేడు రెండు విప్లవ పార్టీల విలీన సభ

ABN , Publish Date - Feb 23 , 2025 | 05:35 AM

కేంద్ర కమిటీల స్థాయిలో విలీన ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా... ఆదివారం రాష్ట్రంలో రెండు పార్టీలు విలీన సభను ఏర్పాటు చేస్తున్నాయి.

Amaravati: నేడు రెండు విప్లవ పార్టీల విలీన సభ

అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండు విప్లవ పార్టీల విలీన ప్రక్రియ ఓ కొలిక్కివచ్చింది. కేంద్ర కమిటీల స్థాయిలో విలీన ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా... ఆదివారం రాష్ట్రంలో రెండు పార్టీలు విలీన సభను ఏర్పాటు చేస్తున్నాయి. విజయవాడలోని ఏంబీ భవన్‌లో ఈ సభను నిర్వహిస్తున్నట్లు న్యూడె మోక్రసీ అధికార ప్రతినిధి పి.ప్రసాద్‌ తెలిపారు. చిట్టిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగే ఈ సభలో వై.సాంబశివరావు, జేవీ చలపతిరావు, సాదినేని వెంకటేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి పి.ప్రసాద్‌, పార్టీ రాష్ట్ర నేతలు విష్ణు, కె.పోలారి తదితరులు పాల్గొంటారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యూడెమోక్రసీలో చీలికలు ఏర్పడ్డాయి. చంద్రం గ్రూప్‌గా ఏర్పడిన పార్టీ సుదీర్ఘ కాలం మనుగడ సాధించలేకపోయింది. ఏ వ్యక్తిని నమ్ముకొని విడిపోయారో అతని పనితీరుపైనే నాయకులు, కేడర్‌కు అపనమ్మకాలు ఏర్పడ్డాయి. ఆనాడు జరిగిన చీలికపై సమీక్ష చేసుకున్న ఆ గ్రూపులోని మెజారిటీ నేతలు తిరిగి సొంత పార్టీలో విలీనమవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రెండు కేంద్ర కమిటీల స్థాయిలో చర్చలు జరిగాయి. అటు కేంద్రంలోనూ, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ విలీన ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ఏపీలో విలీన కార్యక్రమాలు ముగిశాయి. లాంఛనంగా విలీన సభను ఏర్పాటు చేస్తున్నట్లు న్యూడె మోక్రసీ అధికార ప్రతినిధి పి.ప్రసాద్‌ తెలిపారు. నేటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా విప్లవ కర్తవ్యాలను రూపొందిస్తామని ఆయన చెప్పారు. ప్రజలు, ప్రజాసంఘాలు విలీన సభను విజయవంతం చేయాలని ప్రసాద్‌ కోరారు.

Updated Date - Feb 23 , 2025 | 05:42 AM