Government Initiative: నేడు మెగా పీటీఎం 2.0
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:58 AM
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గురువారం మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు పీటీఎం 2 జరగనున్నాయి...
61 వేల బడులు, జూనియర్ కాలేజీల్లో నిర్వహణ
మొత్తం 2.28 కోట్ల మంది పాల్గొంటారని అంచనా
‘పుట్టపర్తి’లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, లోకేశ్
గిన్నిస్ రికార్డు నెలకొల్పే దిశగా అధికారుల ఏర్పాట్లు
అమరావతి/పుట్టపర్తి, జూలై 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గురువారం మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు (పీటీఎం 2.0) జరగనున్నాయి. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. గత విద్యా సంవత్సరంలో తొలిసారిగా నిర్వహించిన మెగా పీటీఎం విజయవంతం కావడంతో ఇప్పుడు రెండోసారి నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సమావేశాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొంటారు. ఈ మేరకు వారికి పాఠశాల విద్యాశాఖ ఆహ్వానాలు పంపింది. 61 వేల ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మెగా పీటీఎం నిర్వహిస్తున్నారు. ఇందులో 74,96,228మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు, దాతలు, ఇతరులు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మొత్తంగా 2.28 కోట్ల మంది మెగా పీటీఎంలలో భాగస్వాములు కానున్నారు. ఒకేరోజుఇంతమంది పాల్గొనే ఈ కార్యక్రమంతో గిన్నిస్ రికార్డు నెలకొల్పే దిశగా ఏర్పాట్లు చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం పండుగ వాతావరణంలో మెగా పీటీఎంలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లల అభ్యసన సామర్థ్యాలు, వారి ప్రవర్తన తదితర అంశాలపై తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తారు. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు, సూచనలను ఈ వేదికగా ప్రభుత్వంతో పంచుకుంటారు. కాగా, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులోని జడ్పీ పాఠశాలలో, శ్రీసత్యసాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే పీటీఎంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో ఉదయం పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన కొత్తచెరువులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడినుంచి పక్కనే ఉన్న జడ్పీ హైస్కూల్‌కు వెళ్తారు. అక్కడ మెగా పీటీఎం అనంతరం చంద్రబాబు పుట్టపర్తి చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి విమానాశ్రయం చేరుకుని విజయవాడకు బయలుదేరి వెళ్తారు.